మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి గుండెపోటుతో సోమవారం ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు. యెర్నేని సీతాదేవి మరణ వార్తతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. యెర్నేని సీతాదేవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నియోజకవర్గం నుండి ఆమె 1985 సంవత్సరం అలాగే 1994 సంవత్సరం లో ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించారు. అలాగే దివంగత ఎన్టీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సీతాదేవి 2013లో బీజేపీలో చేరారు.
యెర్నేని సీతాదేవి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నదే కావడం గమనార్హం. ఆమె భర్త నాగేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నార్ డెల్టా డ్రెయినేజీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. నాగేంద్రనాథ్ ఏడాది క్రితం మరణించారు. నాగేంద్రనాథ్, సీతాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె స్వస్థలంలోనే అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. రేపు సీతాదేవి అంతక్రియలు జరగనున్నట్లు సమాచారం.