‘నా కుమారుడికి ఓటు వేయండి.. నా భర్తకు అవకాశం ఇవ్వండి.. మా తమ్ముడికి అండగా నిలబడండి.. మా అన్నను ఆశీర్వదించండి.. మా నాన్నకు చాన్స్ ఇవ్వండి. మా అత్తను భారీ మెజార్టీతో గెలిపించండి.. మా మావయ్యకు ఓటు వేస్తే అభివృద్ధి చేస్తాడు..’ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల కుటుంబసభ్యులు ప్రజల్లో తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఎన్నికలంటే హడావుడి మామూలుగా ఉండదు. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా సందడి సందడిగా మారుతాయి. ప్రచారాలతో ప్రతి వీధి హోరెత్తిపోతుంది. అభ్యర్థులు ప్రతి ఊరికి వెళ్లలేరు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రచారం చేస్తుంటారు. మిగిలిన సమయాన్ని గెలుపు వ్యూహాలు రచించేందుకు ఉపయోగిస్తుంటారు. ప్రచార బాధ్యతలను కుటుంబసభ్యులకు అప్పగిస్తుంటారు. అప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న వారు ఒక్కసారిగా కొత్త లోకంలోకి వస్తారు. స్థానిక నేతలతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి కరపత్రాలు అందజేసి ఓట్లు అడుగుతుంటారు.
ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. టిఫిన్ బండి వద్దకు వెళ్తే దోశలు వేస్తున్నారు. ప్రజలకు వడ్డిస్తున్నారు. సరదాగా టీ మాస్టర్ అవతారమెత్తుతున్నారు. పూలు కుడుతున్నారు. ఓటర్లతో కలిసి నృత్యం చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలకు అధిపతులైనా సరే రెండు చేతుల జోడించి ఓటరు వద్దకు వెళ్లాల్సిందే. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రచార వేగం పెరిగింది. కొందరు అభ్యర్థులు వేరే ఊర్లలో ఉండే బంధువులను కూడా పిలించి ప్రచారం చేయించుకుంటున్నారు. ముఖ్యంగా నగరాల్లో ఉంటూ ఉద్యోగాలు చేసే యువతను ప్రజా క్షేత్రంలోకి పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అయినా లెక్క చేయకుండా పార్టీ కండువా మెండలో వేసుకుని ప్రచారం చేసేస్తున్నారు. వయసైపోయిన వారైతే సాయంత్రం సమయంలో తిరుగుతున్నారు. ఎప్పుడూ మీడియా ముందుకు రాని వారు కూడా ఎన్నికల సందర్భంగా వచ్చి మా వాళ్లని గెలిపించాలని కోరుతూ నాలుగు ముక్కలు మాట్లాడుతున్నారు. తమ రక్తసంబంధీకులు చేస్తున్న ప్రచారం గురించి అభ్యర్థులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొద్దిరోజులు రాష్ట్రం మొత్తం ఇలా ప్రచారంతో హోరెత్తనుంది.