మాజీ మంత్రి, తెలుగుదేశం నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణలో రోజురోజుకు అసహనం పెరిగిపోతోంది. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదని తెలుగు తమ్ముళ్లను తిట్టడం మొదలుపెట్టారు. రోజూ టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ తాను ఆశిస్తున్న ఫలితాలు కనిపించడం లేదని, క్లాస్‌లు తీసుకుంటున్నారు.
2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన నారాయణ 24 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా ఎన్ టీమ్ పేరుతో పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించుకున్నారు. ఓట్ల జాబితాల కోసం కొందరు, ప్రతి ఇల్లు తిరిగేందుకు కొందరిని ఏర్పాటు చేసుకున్నారు. వీరిపైన ఇన్చార్జిలున్నారు. టీడీపీ డివిజన్ల అధ్యక్షులు, వారి మనుషులు ఎన్ టీమ్‌తో కలిసి పనిచేస్తున్నారు. డివిజన్ల అధ్యక్షులకు ప్రత్యేకంగా ప్యాకేజీ ఇచ్చారు. మిగతా వారందరికీ ప్రతినెలా జీతాలిస్తున్నారు. స్థాయిని బట్టి రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు ముట్టజెబుతున్నారు. ఈ సిస్టమ్‌ను ఆయన ప్రత్యేక కార్యాలయం కంట్రోల్ చేస్తుంది. రోజువారీ నివేదికలు అక్కడికి పంపాలి.
రోజూ నారాయణ ఏదో ఒక సమయంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో వందల సంఖ్యలో పాల్గొంటున్నారు. నివేదికలను ముందు పెట్టుకుని తిట్ల పాఠాలు చెబుతున్నారు. కొద్దిరోజుల రోజుల క్రితం ఓ డివిజన్ నాయకురాలిని ‘నీ వార్డులో టీడీపీ పరిస్థితి బాగోలేదు. ఎంత ఖర్చు పెట్టినా ప్రయోజనం లేకుండా పోతోంది. నువ్వు ఎందుకూ పనికిరావు’ అన్నారు. అందరి ముందు తిట్టేసరికి ఆమె కన్నీరుమున్నీరయ్యారు. చాలాకాలంగా ఆమె పార్టీలో ఉన్నారు. గతంలో కొన్ని పదవులు నిర్వర్తించారు. సీనియర్, పైగా మహిళ అనే గౌరవం లేకుండా నారాయణ తిట్టేశారు. రెండు రోజుల క్రితం ఓ డివిజన్లో కీలకంగా ఉన్న దళిత నాయకుడి విషయంలో దారుణంగా ప్రవర్తించారు. ‘నువ్వు డివిజన్లో తిరగడం లేదు. ఒక్క ఇటికీ వెళ్లినట్లుగా లేదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలుస్తా. ఇంకెందుకయ్యా మాకు నువ్వు. ఆఫీస్‌కు వచ్చి దానికి కావాలి.. దీనికి కావాలని కట్టలు కట్టలు తీసుకెళ్తారు. నాకు ఒక్క శాతం కూడా ఉపయోగపడరు’ అన్నారు. సదరు నేత సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు.
కోటంరెడ్డి మనుషులే టార్గెట్
19 ఎన్నికల్లో ఓటమి తర్వాత నారాయణ నెల్లూరులో లేరు. హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఇక్కడ పార్టీ ఇన్చార్జిగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. ఈయన బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేశారు. 24లో టికెట్ తనదేనని భావించారు. కానీ ఆరునెలల ముందు నారాయణ ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశానికి ఆర్థిక స్తంభం కావడంతో చంద్రబాబు టికెట్ ఇచ్చేశారు. దీంతో కోటంరెడ్డిని బుజ్జగించడానికి నారాయణ కొంత డబ్బు ముట్టజెప్పారు. పార్టీలో రాష్ట్ర స్థాయి పదవి ఇప్పించారు. కానీ అతనిపై నమ్మకం లేదు.
ప్రస్తుతం కోటంరెడ్డి మనుషులు చాలామంది డివిజన్లలో కీలకంగా ఉన్నారు. వారినే కొద్దిరోజులుగా నారాయణ తిడుతున్నారు. వీరంతా డబ్బు తినేస్తున్నారు తప్ప రిజల్ట్స్ చూపించడం లేదని తన మనుషుల వద్ద వాపోతున్నారు. ఇటీవల తన వర్గం వారికి జీతాల రాలేదని కోటంరెడ్డి.. నారాయణ మనుషులను అడగ్గా వారి మధ్య గొడవ కూడా జరిగింది. ఇది, తన వారిని టెలీకాన్ఫరెన్స్లలో తిడుతున్న విషయాలను శ్రీనివాసులురెడ్డి బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. నారాయణ గెలిచే పరిస్థితి లేదని, ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి కాదని ప్రజలకు అర్థమైపోయిందని వాపోయారు. డబ్బుందన్న అహకారంతో ఇష్టమొచ్చినట్లు తన మనుషులను తిడుతున్నారని, దీనిపై మీరే ఏదో ఒకటి చేయాలని చెప్పగా.. బాలకృష్ణ సర్దిచెప్పారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. టీడీపీ నాయకులు తన డబ్బులు తినేస్తున్నారని తెగ బాధపడిపోతున్న నారాయణకు వచ్చే ఎన్నికలు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.