సార్వత్రిక ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ ఈ నెల 31న జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బహు కీలకంగా మారనుంది. రానున్న బుధ వారం రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగ నుంది. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఉపయోగించుకోనుందని సమాచారం.
ఎన్నికలు దగ్గరవుతున్నాయి కాబట్టి జరగనున్న ఈ భేటీలో ఎన్నికల వరాలు ప్రకటిస్తారని ఒక అంచనా. మరొక ఇరవై రోజుల్లో ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉన్నందున ఈ భేటీలో ఖచ్చితంగా జగన్ ఎన్నికల వరాలు ప్రకటించే అవకాశం ఉంది
ఫిబ్రవరి 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ కూడా చర్చల్లో రాబోయే మరొక అంశంగా తెలుస్తుంది. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల తరువాత ఏపీ బడ్జెట్‌కు తుది రూపు ఇవ్వనున్నారు.
డీఎస్సీ పరీక్షల నిర్వహణపైన ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.. కొత్త పీఆర్సీ పైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చేందుకు మరింత సమయం అవసరమయేలా ఉండటంతో, ఈలోపుగా ఉద్యోగులకు ఐఆర్ (మధ్యంతరభృతి) ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
దీని విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చలు చేపట్టాల్సి ఉంది. అధికారిక వైసీపీ వర్గాల్లో రైతులకు రుణమాఫీ దిశ గా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదనే వార్త చక్కర్లు కొడుతుంది.
తెలంగాణ తరహాలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం నివేదిక సేకరించింది. దీని పైన నిర్ణయం, రాజకీయంగా మంత్రులకు సీఎం జగన్ సూచనలు, ఫిబ్రవరిలో ప్రభుత్వం చేయూత, జగనన్న కాలనీల ప్రారంభం మొదలగు వాటిపై నిర్ణయం తీసుకోన్నారు. ఎన్నికల వేళ నిర్వహిస్తున్న సమావేశం కావటంతో ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలకు ఆమోద ముద్ర వేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.