వాస్తవాలకు పాతరేస్తూ ప్రభుత్వంపై విషపు రాతలతో విరుచుకుపడుతున్న రామోజీ మరోసారి జగన్ సర్కారుపై తన అక్కసును వెళ్లగక్కారు. ఓ రాజకీయ పార్టీకి లబ్ది కలిగించేందుకు రామోజీ చేయని ప్రయత్నం లేదు. తాజాగా మంగంపేట ముగ్గురాయి గనుల్లో భారీ దోపిడీకి తొలగిన తెర అంటూ పూర్తి వక్రీకరణలతో కూడిన కథనాన్ని వండి వార్చి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. కానీ బెరైటీస్ గనుల టెండర్ల వెనుక ఉన్న అసలు వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి.
అన్నమయ్య జిల్లాల మంగంపేటలోని బెరైటీస్ గనుల ద్వారా ఏటా ౩౦ లక్షల బెరైటీస్ ను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపిఎండిసి) ఉత్పత్తి చేస్తోంది. దీనిలో సగటున 10 లక్షల టన్నులు ‘ఎ’ గ్రేడ్, 3 లక్షల టన్నులు ‘బి’ గ్రేడ్, మిగిలిన 17 లక్షల టన్నులు ‘సి, డి & డబ్ల్యు (వేస్ట్) గ్రేడ్ లుగా ఉంటుంది. సి, డి గ్రేడ్ ఖనిజానికి డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున దాదాపు 80 లక్షల టన్నుల వరకు ఖనిజం నిల్వలు పేరుకుపోయాయి. వాటిని నిల్వ చేయడం, నిర్వహించడం కూడా ప్రభుత్వానికి భారంగా మారింది. వాటి విక్రయం, బెనిఫికేషన్ కోసం గతంలో పలుసార్లు టెండర్లు నిర్వహించినప్పటికీ సరైన స్పందన లభించలేదు. ఈ టెండర్ల ద్వారా వాటిని విక్రయిస్తే ఈ నిర్వహణా ఖర్చు తగ్గడంతో పాటు సంస్థకు ఆదాయం లభించే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా సి, డి గ్రేడ్ బెరైటీస్ కు మార్కెట్ కల్పించాలనే లక్ష్యంతో ఎపిఎండిసి కోటి టన్నులకు తాజాగా ఎంఎస్టీసి ద్వారా టెండర్లు పిలిచింది. సాధారణంగా ప్రతీ ఏటా 20 లక్షల టన్నుల సి, డి, డబ్ల్యు గ్రేడ్ ఖనిజానికి ఎపిఎండిసి టెండర్లు పిలుస్తోంది. కానీ కొనుగోలు దారుల నుంచి తగిన స్పందన రావడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏడాదికి 20 లక్షల టన్నుల చొప్పున అయిదేళ్ళకు గానూ ఒకేసారి కోటి టన్నుల ఖనిజానికి టెండర్లు పిలవడం జరిగింది. దీనిని అర్థం చేసుకోలేక ఒకేసారి కోటి మెట్రిక్ టన్నులకు టెండర్లు పిలిచారంటూ ఈనాడు పత్రిక అవగాహన లేని రాతలు రాసింది.
నిబంధనలకు అనుగుణంగానే రిజర్వ్ ధర
సి, డి గ్రేడ్ ఖనిజానికి రిజర్వు ధరను కూడా తగ్గించారంటూ తప్పుడు ఆరోపణలు తన కథనంలో ఈనాడు ప్రచురించింది. అంతర్జాతీయ మార్కెట్ లోని ధరలతో పాటు జిఓ 262 నిబంధనలకు అనుగుణంగానే ఈ రేటును నిర్ణయించడం జరిగింది. ఆసక్తి ఉంటే ఇదే ధరకు రామోజీరావు కూడా టెండర్లలో పాల్గొని, బిడ్ ను దక్కించుకోవచ్చు. వాస్తవానికి టెండర్ల ప్రక్రియను మినీరత్నగా కేంద్రం గుర్తించి ఎంఎస్టీసి పర్యవేక్షిస్తోంది. కేంద్ర జిఎఫ్ఆర్ నిబందనలకు లోబడే ధరావత్తును ఖరారు చేయడం జరిగింది. అలాగే 17 రోజుల్లోనే టెండర్లను పూర్తి చేస్తారనేది కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుందే తప్ప దీనిలో ఎపిఎండిసి సొంతగా నిర్ణయించేదేమి లేదు.
టెండర్ డాక్యుమెంట్ ధరను ఖరారు చేసే క్రమంలో టెండర్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్, కన్సల్టెన్సీ చార్జీలు, ప్రిపరేషన్, కమ్యూనికేషన్ చార్జీలు, ఎంఎస్టీసి చెల్లింపులకు అయ్యే మొత్తం వ్యయంను దృష్టిలో పెట్టుకునే దానిని నిర్ణయించడం జరిగింది. ఇది సాధారణంగా ఏ సంస్థ అయినా అనుసరించే విధానం. దీనిని కూడా ఈనాడు పత్రిక అక్రమంగా చిత్రీకరించడం విడ్డూరంగా ఉంది. న్యాయసమీక్ష ఎందుకు పెట్టలేదంటూ ఈనాడు పత్రిక చేస్తున్న వాదన ఆ పత్రికకు ఉన్న అవగాహనారాహిత్యంకు నిదర్శనం. రూ.100 కోట్లకు పైగా వ్యయం అయ్యే ప్రాజెక్ట్ లకు నిర్వహించే టెండర్లకే న్యాయసమీక్షను కోరుతారు. ఇక్కడ బెరైటీస్ నిల్వలను విక్రయించేందుకు పిలిచిన టెండర్లలో వ్యయం ఎక్కడ ఉంది? ఇది న్యాయసమీక్ష పరిధిలోకి రాదనే కనీస ఇంగితం కూడా ఈనాడు పత్రికకు లేకపోవడం, ఈ పత్రికకు ఉన్న విషయ పరిజ్ఞానం ఏపాటిదో అర్థమవుతోంది.
ఈనాడుపై న్యాయ పరమైన చర్యలు
ఈనాడు పత్రిక ప్రచురించిన కథనాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ విసి&ఎండి విజి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సి, డి గ్రేడ్ బెరైటీస్ ను టెండర్ల ద్వారా విక్రయించేందుకు ఎపిఎండిసి చేస్తున్న ప్రయత్నంపై బురదచల్లేలా కనీస వాస్తవాలు తెలుసుకోకుండా ‘ఈనాడు’ పూర్తి అబద్దాలతో ఇటువంటి తప్పుడు వార్తను ప్రచురించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు పత్రిక దోపిడీగా చిత్రీకరిస్తూ రాసిన తప్పుడు కథనంపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని విజి వెంకటరెడ్డి హెచ్చరించారు.