ఎప్పటికప్పుడు జగన్ ప్రభుత్వంపై బురదజల్లుతూ అసత్య కథనాలతో రెచ్చిపోయే రామోజీ రావు, ఈసారి దేశంలోనే తలమానికంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘అమ్మఒడి” పథకంపై విష ప్రచారానికి దిగాడు. ప్రైవేటు పాఠశాలలకు లబ్ది చేకూర్చేలా నిజాలకు పాతరేస్తూ ‘అమ్మ ఒడికి మావయ్య గండి’ అంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసాడు. కానీ ఈనాడులో రాసినట్లుగా కాకుండా నిజాలు మరో విధంగా ఉన్నాయి.
పేద పిల్లలంతా చదువుకోవాలన్న సదుద్దేశంతో జగన్ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా తమ పిల్లలను పాఠశాలకు పంపించే తల్లుల బ్యాంక్ అకౌంట్లో రూ. 15000 రూపాయలను ప్రభుత్వం జమ చేస్తుంది. కాగా రకరకాల సాకులతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారన్నది ఈనాడు ఆరోపణ. నిజానికి 2019 – 20 సంవత్సరంలో 42,33,098 మంది లబ్దిదారులకు రూ. 6349.6 కోట్లను, 2020-21 సంవత్సరంలో 44,48,865 అర్హులైన లబ్దిదారులకు రూ. 6673.4 కోట్లను జగన్ సర్కారు వెచ్చించింది .
కాగా కోవిడ్ కారణంగా 2019-20, 2020-21 సంవత్సరాల్లో విద్యార్థులకు తప్పనిసరిగా 75% అటెండెన్స్ ఉండాలన్న నిబంధన నుండి మినహాయింపునిచ్చింది. దాంతో లబ్ధిదారుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. కోవిడ్ అనంతరం 75% హాజరు నిబంధన అమలు చేయడంతో పాటు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కొందరి లబ్ధిదారులు ఆర్ధికంగా బలపడటంతో 2022-23 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 42,61,965 కు తగ్గింది. కాగా 2022-23 సంవత్సరంలో రూ. 6392.9 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది.
స్కూల్ మైంటైనెన్స్ & టాయిలెట్ మైంటైనెన్స్ పేరుతో రూ. 2000 తగ్గించి రూ.13000 మాత్రమే లబ్ధిదారులకు అందిస్తుందని ఈనాడు రాసుకొచ్చింది. కానీ పాఠశాలల్లో అపరిశుభ్ర టాయిలెట్ల కారణంగా ఏ ఒక్క విద్యార్థి ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకు దూరం కాకూడదన్న సదుద్దేశంతో టాయిలెట్ మైంటైనెన్స్ చేయడానికి రూ.1000 ప్రభుత్వం కేటాయించింది. ఈ మొత్తం ద్వారా టాయిలెట్లు శుభ్రంగా ఉంచడం, ఆడపిల్లలు బట్టలు మార్చుకునే గదుల నిర్మాణం, వాష్ బేసిన్ల ఏర్పాటు ఇలా టాయిలెట్స్ కి అవసరమైన వస్తువులను కొనడం లాంటివి చేస్తుంది.
గత రెండేళ్లలో టాయిలెట్ మైంటైనెన్స్ ఫండ్ ద్వారా రూ. 987.20 కోట్లను ప్రతీ లబ్ధిదారుని నుండి కలెక్ట్ చేసిన ప్రభుత్వం ఆ మొత్తంతో 44,800 పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 46,661 మంది ఆయాలను నియమించింది. వారికి నెలకు రూ. 6000 గౌరవ వేతనం చెల్లిస్తుంది. 2021-22 సంవత్సరంలో రూ. 245.09 కోట్లని టాయిలెట్ మైంటైనెన్స్ కి కలెక్ట్ చేసిన ప్రభుత్వం రూ. 241.00 కోట్లను ఖర్చు చేయగా 2022-23 లో రూ. 407.98 కోట్లను కలెక్ట్ చేసి రూ. 407.50 కోట్లను ఖర్చు చేసింది. 2023-24 విషయానికి వస్తే రూ. 338.42 కోట్లను కలెక్ట్ చేసి రూ. 233.50 కోట్లను ఖర్చు చేసింది. మొత్తంగా రూ. 991.49 కోట్లను కలెక్ట్ చేయగా రూ. 882 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.
స్కూల్ మైంటైనెన్స్ ఫండ్ లో భాగంగా ప్రతీ పేరెంట్ నుండి రూ. 442 కోట్లను కలెక్ట్ చేసిన ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులు,టీచర్లకు అవసరమైన పరికరాలు మౌలిక సదుపాయాల కోసం 182.6 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇప్పటికే మనబడి నాడు నేడు ద్వారా విద్యాలయాలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్న జగన్ ప్రభుత్వం పేదింటి పిల్లలను ప్రపంచస్థాయి విద్యార్థులుగా తీర్చి దిద్ధేందుకు డిజిటల్ ఎడ్యుకేషన్ కి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 2022-23 సంవత్సరంలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు రూ. 686 కోట్ల వ్యయంతో 5,18,740 అధునాతన ట్యాబులను అందించింది. 2023-24 సంవత్సరంలోరూ.638.17 కోట్ల వ్యయంతో 4,35,000 ట్యాబులు అందించేందుకు సన్నాహాలు చేస్తుంది. అంతేకాకుండా 31,884 ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్ ను రూ. 410.32 కోట్ల వ్యయంతో తరగతి గదుల్లో ఏర్పాటు చేసింది.
జగనన్న గోరుముద్ద పథకం ద్వారా రుచికరమైన భోజనం విద్యార్థులకు పెడుతున్న ప్రభుత్వం, మూడు జతల యూనిఫామ్ అందిస్తూ, రెండుభాషల్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ తో పాటు, షూస్, స్కూల్ బ్యాగ్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీని కూడా విద్యార్థులకు అందిస్తుంది. పేద విద్యార్థులను తీర్చి దిద్దడానికి జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే ఈనాడు విష ప్రచారానికి దిగడం జగన్ ప్రభుత్వంపై రామోజీకి ఉన్న విద్వేషమే కారణం అని చెప్పొచ్చు.