తెలుగుదేశం, జనసేన, బీజేపీలో టికెట్ల వ్యవహారం తేలక.. కేటాయించిన చోట్ల గొడవలు జరుగుతుంటే ఆ విషయాలను ఈనాడు పట్టించుకోదు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లను ఒకే విడతలో ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై రామోజీరావు పత్రిక ఏడుపు అందుకుంది. స్థానాల కేటాయింపు విషయంలో ఈసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త వ్యూహాలతో ముందుకెళ్లారు. 50 శాతం మేర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చారు. మొదటి నుంచి చెప్పినట్లు కొందరికి నిరాకరించారు. మరికొందరిని వేరే చోటకు పంపారు. అయితే ఈనాడు మాత్రం పార్లమెంట్ సీట్ల కేటాయింపుపై కట్టు కథలు ప్రచురించింది. రూ.కోట్లలో డిమాండ్.. చివరికి బతిమాలి టికెట్లు.. కృత్రిమ డిమాండ్ సృష్టికి వైకాపా యత్నాలు.. అసెంబ్లీ స్థానాల్లో ఖర్చంతా నెత్తిన రుద్దే ఆలోచన.. పార్టీ విజయావకాశాలు సన్నగిల్లడంతో జారుకున్న సిటింగ్‌లు.. అభ్యర్థుల్లేకే బీసీలకు సీట్లంటూ జగన్ హడావుడని రాసుకొచ్చింది. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు రాఘవరెడ్డి ఢిల్లీ మద్యం కేసులో కీలకంగా ఉన్నారు. దీంతో జగన్ అలాంటి వారికి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో ఇద్దరూ టీడీపీలో చేరిపోయారు. ఇక్కడ ఎంతో విధేయుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నిలబెట్టారు. కర్నూలులో సంజీవకుమార్ స్థానంలో బోయ సామాజికవర్గానికి చెందిన ఎల్లా రామయ్యకు చాన్స్ ఇచ్చారు. ఇక నరసారావుపేట ఎంపీ సీటును బీసీకి ఇవ్వాలని నిర్ణయించి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌కు ఖరారు చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయులును గుంటూరుకు వెళ్లాలని చెప్పారు. కానీ ఆయనకు ఇష్టం లేక తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు సిటీ సీటును ముస్లింకు ఇవ్వడంతో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తనలోని పెత్తందారీ పోకడలు బయటపెట్టారు. భార్యకు ఇవ్వలేదని, కేంద్ర మంత్రి పదవి ఆశతో పార్టీ మారారు. వీటిని ఈనాడు దాచిపెట్టి వైఎస్సార్సీపీ ఓడిపోతుందని మారారని రాసి సంబరపడింది.
జగన్ లెక్కలు ఎవరి ఊహకు అందవు. ఆయన వెనుకబడిన వర్గాలను చట్టసభల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయోగాలు చేశారు. జనరల్ స్థానాల్లో వారికి అవకాశం కల్పించారు. అంతేగానీ పార్టీ ఓడిపోతుందని భయపడి కాదు. ఇంకా చంద్రబాబే వందల కోట్ల రూపాయలు పెట్టే వారి కోసం ఎంపీ సీట్లను ఇంకా ప్రకటించకుండా ఆపారు. బాబు చెప్పినట్లుగా రాసుకుంటూ పోతే ఈనాడు పేరు ఈనాయుడిగా స్థిరపడిపోవడం ఖాయం.