విద్య ప్రభుత్వ బాధ్యత కాదని చైతన్య, నారాయణ లాంటి ప్రైవేట్ విద్యా సంస్థలను చంద్రబాబు ప్రోత్సహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ విద్యాలయాల్లో సరైన వసతులు లేని కారణంగా ఎందరో పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు వంటి పథకాల ద్వారా ప్రభుత్వ విద్యాలయాలను ప్రైవేట్ విద్యాలయాలకు ధీటుగా ప్రభుత్వం తయారుచేసింది. అంతేకాకుండా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా ఉన్నత చదువులు చదవాలనుకుంటున్న ఎందరో పేద విద్యార్థులకు ఆసరాగా నిలబడింది.
జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ప్రభుత్వం చెల్లిస్తుంది. నేడు 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన పథకం క్రింద అర్హులైన 8,09,039 లక్షల మంది తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నొక్కి రూ.584 కోట్లు జమ చేసారు. ఈ ఏడాది విద్య దీవెన పథకంలో భాగంగా తొలి రెండు త్రైమాసికాల్లో అనగా మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేసిన మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం కావడం గమనార్హం. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకూ విద్యారంగంలో సంస్కరణలపై జగన్ ప్రభుత్వం అక్షరాలా చేసిన ఖర్చు రూ.73,417 కోట్లు. గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యాలయాలను, వాటిలో విద్యను అభ్యసిస్తున్నవిద్యార్థులను పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ పేద విద్యార్థులు చదువుకుంటేనే వారి భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కూడా బావుంటుందని నమ్మి విద్యా రంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం, గత వారి అభ్యున్నతి కోసం పాటు పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.