ఆంధ్రప్రదేశ్లోవిద్యా రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు చర్యలు తీసుకున్నారు. లెక్చరర్లు పుస్తకాలు చూసి బ్లాక్ బోర్డులపై రాసే విధానానికి క్రమంగా స్వస్తి చెప్పనున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాఠాలు బోధించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలుత ఫిజిక్స్, కెమెస్ట్రి, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ఇది జరుగుతుంది. ఇందులో భాగంగా దేశంలోనే మొదటిసారిగా వర్చువల్ లెర్నింగ్ ల్యాబ్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. కళాశాల విద్యాశాఖ అమెరికాకు చెందిన జెడ్ స్పేస్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.
పాఠ్యాంశాలను త్రీడీ విధానంలో విలువలైజ్ చేసి బోధిస్తారు. ఇందుకోసం జెడ్ స్పేస్ రూపొందించిన ప్రత్యేక ల్యాప్‌టాప్‌ను వాడుతారు. 40 శాతం కంటెంట్‌ను సదరు సంస్థ ఉచితంగా ఇస్తుంది. మిగిలిన దానిని విద్యాశాఖ రూపొందిస్తుంది. లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ల్యాప్‌టాప్‌లు వర్చువల్ రియాలిటీ సామర్థ్యాలతో కూడిన పోర్టబుల్ వర్క్ స్టేషన్లుగా పనిచేస్తాయి. ఇక త్రీడీ అద్దాలు వాడాల్సిన అవసరం లేదు. వర్చువల్ ఆబ్జెక్టులు స్క్రీన్ వెలుపల, లోపలికి కదలాడుతూ వాస్తవికంగా కనిపిస్తాయి. తొలి దశలో కడప, అనంతపురం, రాజహేంద్రవరం ఆర్ట్స్, విజయవాడ ఎస్ఆర్ఆర్ – సీవీఆర్, గుంటూరు, విశాఖపట్నంలోని ప్రభుత్వం డిగ్రీ కాలేజీల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. తర్వాత దశలవారీగా విస్తరిస్తారు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగంలో అనేక వాప్లవాత్మక మార్పులు తెచ్చారు. ప్రాథమిక స్థాయి నుంచే కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏఐతో పాఠ్యాంశాల బోధన అనే ఆలోచన వినూత్నమైందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.