పెయిడ్ న్యూస్‌పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. అలాంటి వార్తలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంది. పార్లమెంట్, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఫలితాల వరకు ఇది అమల్లో ఉంటుంది. ఎన్నికల్లో మీడియా పాత్ర నిష్పక్షపాతంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. ఇందులో భాగంగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)లను అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి ఇవ్వడంతోపాటు పెయిడ్ న్యూస్‌ను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
జాతీయ, రాష్ట్ర పార్టీలు, రిజిష్టర్ పార్టీల అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలను ఇచ్చేందుకు మూడు రోజులు ముందే ఎంసీఎంసీకి దరఖాస్తు చేసుకోవాలి. రిజిష్టర్ కాని పార్టీలు, ఇతర వ్యక్తులు వారి ప్రకటనల ప్రసారం కోసం ఏడు రోజులు ముందుగా అప్లికేషన్ ఇవ్వాలి. రెండురోజుల్లోపు ఎంసీఎంసీ అనుమతి మంజూరు చేస్తుంది. వార్తాపత్రికల్లో పోలింగ్ రోజు, పోలింగ్‌కు ముందురోజు తప్పనిసరిగా ఎంసీఎంసీ అనుమతి పొందిన తర్వాతే ఆ ప్రకటనలను ప్రచురించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
అన్ని రకాల టీవీ ఛానళ్లు, కేబుల్ నెట్‌వర్క్‌లు, డిజిటల్, మొబైల్ నెట్‌వర్క్‌ల ద్వారా పంపే బల్క్ ఎస్ఎంఎస్, వాయిస్ మెసెజ్‌లు ఎలక్ట్రానిక్ మీడియా పరిధిలోకి వస్తాయి. ఫేస్బుక్, ట్విట్టర్ (ఎక్స్), యూట్యూబ్, ఇన్స్టాగ్రాం, వాట్సప్, గుగూల్ వెబ్‌సైట్స్ వంటివి కూడా దాని పరిధిలోనే ఉంటాయి. సినిమా హాళ్లలో, ప్రైవేటు ఎఫ్ఎం రేడియో తదితర వాటిల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలకు కూడా ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరిగా తీసుకోవాలి. అభ్యర్థులు ఎంసీఎంసీ టెలికాస్ట్ సర్టిఫికెట్ పొందిన తర్వాతే ప్రచారం చేపట్టాలి. తాము ప్రకటనలు ఎందులో ఇవ్వాలనుకుంటున్నారో సీడీలో వీడియో, ఆడియో రికార్డు చేసుకుని ప్రకటన టైటిల్, తయారీకైన ఖర్చు, ప్రకటనలు ఇచ్చేందుకు అయ్యే ఖర్చు వంటి అంశాలతో దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లోని ఎంసీఎంసీ కమిటీకి రెండు సెట్లు ఇవ్వాలి. సర్టిఫికెట్ లేని ఎన్నికల ప్రకటనలు ఎవరూ ప్రదర్శించడానికి వీల్లేదు. అనుమతి పొందిన ఆర్డర్ నంబర్‌ను సంబంధిత ప్రకటనపై సూచించాలి.