డీఎస్సీ షెడ్యూల్ ను ఎన్నికల్లోపు పూర్తి చేయాలని భావించినా కానీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో పరీక్ష నిర్వహణకు బ్రేక్ పడింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు టెట్ రాసి ఫలితాలు కోసం వేచి చూస్తున్నారు. ఈ సందర్భంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణను ఎన్నికలయ్యేవరకూ వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్ ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది.
వాస్తవానికి ఏపీ టెట్ పరీక్షలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఈపాటికే పూర్తి కావల్సింది. కానీ హైకోర్టు ఆదేశాలతో షెడ్యూల్ రివైజ్ అయింది. కొత్త షెడ్యూల్ ప్రకారం మార్చి 20వ తారీకు నుంచి 22వ తారీకు మధ్యలో టెట్ పరీక్ష ఫలితాలు వెల్లడి కావల్సి ఉంది. అదే సమయంలో మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అందులో భాగంగా మార్చి 20 నుంచి డీఎస్సీ పరీక్షా కేంద్రాల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, మార్చి 25 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ పూర్తవాలి. కానీ ఎన్నికల కోడ్ రావడంతో అనుమతి కోసం ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది.
ఈ క్రమంలో ఎన్నికల సంఘం నుంచి అనుమతి ఆలస్యం కావడంతో విద్యార్ధుల్లో నెలకొన్న గందరగోళాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం పరీక్షల నిర్వహణను వాయిదా వేసింది. ఎన్నికల కమీషన్ నుంచి ఆదేశాలు వచ్చాక అటు టెట్ ఫలితాల విడుదల, ఇటు డీఎస్సీ రివైజ్డ్ షెడ్యూల్ ఉంటాయని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. ఎన్నికల కోడ్ ముగిసేవరకూ టెట్ ఫలితాల విడుదల, డీఎస్సీ పరీక్షల నిర్వహణ వాయిదా వేయాలని ఈసీ ఆదేశించింది.