తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి తనయుడిగా నారా లోకేశ్ చాలా కాలంగానే రాజకీయాల్లో ఉన్నారు. కానీ అవగాహన మాత్రం శూన్యం. ఆయనకు స్ర్కిప్ట్ ఎవరు రాసిస్తారో గానీ.. గుడ్డిగా అప్పజెప్పేసి జనంలో నవ్వుల పాలవుతుంటారు. ఇది గతంలో అనేక సందర్భాల్లో జరిగింది. తాజాగా నరసన్నపేట, శ్రీకాకుళంలో నిర్వహించిన టీడీపీ శంఖారావం బహిరంగ సభల్లో లోకేశ్ మాట్లాడారు. ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఒక నియోజకవర్గంలో పనిచేయని వారు మరో చోట పని చేస్తారా? ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమిని అంగీకరించారన్నారు.
టీడీపీ ఆశాకిరణంగా లోకేశ్‌ను చంద్రబాబు తమ నేతలపై రుద్దతున్నారు. కానీ ఆ రాజకీయ వారసుడు చాలా విషయాలు తెలుసుకోవాలి. పొలిటికల్ పార్టీలకు ఎన్నికల్లో గెలుపే లక్ష్యం. దీని కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. ప్రత్యర్థుల అడుగులను బాగా గమనించి అభ్యర్థుల విషయంలో ప్రయోగాలు చేస్తుంటారు. కొందరిని సొంత ప్రాంతం నుంచి వేరే చోటుకు పంపుతుంటారు. ఒకసారి చరిత్రని చూస్తే బోలెడు విషయాలు తెలుస్తాయి. అంతెందుకు చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లలేదా.. ఆయన భయపడి వెళ్లాడంటే లోకేశ్ ఒప్పుకుంటావా.. సరే.. ఆయన తాత ఎన్టీ రామారావు ఎమ్మెల్యేగా ఎక్కడెక్కడ పోటీ చేసి గెలిచారో తెలియదా.. కొత్త అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంతూరు ఎక్కడ.. 2019 ఎన్నికల్లో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేశారో అప్పుడే మర్చిపోయారేమో.. మరి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయంలోనే అభ్యంతరం ఎందుకు? ఆయన కూడా అందరి లాగే వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త వ్యూహాలతో ముందుకొచ్చారు. పలువురికి టికెట్లు లేవని ఖరాఖండిగా చెప్పారు. కొందరిని వేరే నియోజకవర్గానికి పంపారు. ఈ పనులను చాలా ధైర్యంగా చేశారు.
జగన్‌లా నారా వారు చేయగలరా.. నాన్చకుండా మీ నాయకులకు చెప్పగలరా.. చంద్రబాబు కూడా గతంలో చాలామంది స్థానాలు మార్చారు. అలా ఎందుకు చేశారో.. అసలు లోకేశ్ సొంత ఊరు హైదరాబాద్. ఇల్లు, భార్యాపిల్లలు ఉండేది అక్కడ. మరి 19లో మంగళగిరి నుంచి ఎందుకు పోటీ చేశారు. మరోసారి బరిలో ఉండాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీని విమర్శించాలి కాబట్టి ఏదో అనేశానంటే సరిపోదు చినబాబూ. ప్రజలు అన్ని గమనిస్తుంటారు. అర్థంపర్థం లేని మీ మాటల వల్లే తెలుగు తమ్ముళ్లు భయపడుతున్నారు. నాయకులైతే ఇతన్ని ఎందుకు జనంలోకి వదిలారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. టీడీపీని ముంచాలంటే ఈ మాత్రం బుర్ర ఉండాలని బాబు పుత్రరత్నంపై ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు.