ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ఒక యుద్దం జరగబోతుంది. ఆ యుద్దం పేదవాడికి పెత్తందారులకి మధ్య జరిగే మహా యుద్దంగా ముఖ్యమంత్రి జగన్ గారు ప్రతి సభలో ప్రకటిస్తూ వస్తున్నారు. ఆయన మాటలను కాస్త లోతుగా విశ్లేషించి చూస్తే పేదవాడికి వచ్చే సంక్షేమ పధకాలపై విషం చిమ్ముతున్న తెలుగుదేశం పార్టీ పూర్తిగా పేదల వ్యతిరేకిగా మారి పెట్టుబడిదారులు, పెత్తందారుల పక్షాన నిలిచి పేదలపై మీడియాని అడ్డం పెట్టుకుని ప్రత్యక్ష యుద్దానికి దిగినట్టుగానే కనిపిస్తుంది.
ఈ నేపధ్యంలోనే జగన్ గారు రాబోయే ఎన్నికలు పెత్తందారులకి పేదవాడికి మధ్య జరిగే యుద్దంగా, సంక్షేమ పధకాలను వ్యతిరేకిస్తు వచ్చిన చంద్రబాబు పెత్తందారుల పక్షాన్న నిలిచిన వ్యక్తిగా, సంక్షేమ పధకాలు పేదలపై పెట్టే సామాజిక పెట్టుబడిగా బావించే తాను మాత్రం పేదల పక్షాన్న నిలబడతానని చెబుతూ వస్తున్నారు. అయితే ఈ మాటలని చంద్రబాబు తన 40ఏళ్ళ అనుభవంతో పూర్తిగా అర్ధమే మార్చేసి సభల్లో మాట్లాడుతునట్టు కనిపిస్తూ ఉంది.
చంద్రబాబు గత కొద్దిరోజులుగా సభల్లో మాట్లాడుతూ తన దగ్గర డబ్బులు ఉన్నాయని దానికే తనని పెత్తందారని జగన్ అంటున్నాడని, జగన్ దగ్గర మాత్రం ఏం డబ్బులు లేనట్టు తాను పేదవాడినని చెప్పుకుంటున్నాడని , జగన్ దగ్గర డబ్బు లేదంటే మీరు నమ్ముతారా తమ్ముళ్ళు అంటూ ఒకరకమైన హేళనతో మాట్లాడుతూ, జగన్ మాటలని వక్రీకరిస్తూ ప్రజలని తప్పు దోవ పెట్టించే ప్రయత్నం నిర్విరామంగా చేస్తున్నారు.
చరిత్రలో పెత్తందారీ వ్యవస్థపై పోరాటం చేసిన వారిలో అదే ధనిక వర్గం నుండి వచ్చి పేదల పక్షనా నిలిచి చరిత్ర గతినే మార్చిన మహా నాయకుల చరిత్రలు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకి తెలియదని అనుకోవడం పొరపాటే అవుతుంది. ధనిక వర్గంలో పుట్టి పెత్తందారీ వ్యవస్థపై పోరాటం చేసిన తెలంగాణ వీర వనిత మల్లు స్వరాజ్యం గారి చరిత్ర చంద్రబాబుకి తెలియదా? అదే భూస్వామ్య పెత్తందారి వర్గంలో పుట్టిన పుచ్చలపల్లి సుందరయ్య గారు అదే పెత్తందారి వర్గంపై పేదల పక్షాన నిలబడి పోరాడిన నాయకుడని తెలియదా?
చంద్రబాబుకి అన్నీ తెలుసు కాకపోతే ఆయన ఈ చరిత్రలన్ని ప్రజలకి తెలియటానికి ఇష్టపడరు. అందుకే పెత్తందారుపై మల్లు స్వరాజ్యం , పుచ్చలపల్లి సుందరయ్య గారిలా జగన్ కూడా పేదల పక్షాన్న నిలబడి పోరాటానికి దిగితే. తన 40ఏళ్ల రాజకీయ అనుభవంతో ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. కానీ చంద్రబాబు మాటలు గతంలో మాదిరి ఇపుడు ప్రజలు నమ్మే పరిస్థితులో మాత్రం లేరు.