ఏపీలో ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీపై టీడీపీ వారు ఎలక్షన్ కమిషన్ కు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారిని పెన్షన్ పంపిణీకి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీని అంతా ఒకేలా కాకుండా వివిధ రకాలుగా చేయాలని నిర్ణయించి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు ఎలక్షన్ కమిషన్ చేసింది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మేరకు ప్రభుత్వం రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి వీలుగా సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.
పెన్షన్ల పంపిణీపై సవరించిన విధివిధానాలను ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. దీని ప్రకారం రేపు మధ్యాహ్నం నుంచి ఈనెల 6 లోగా పెన్షన్ల పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే కేటగిరీల వారీగా పెన్షన్ల పంపిణీకి విధివిధానాలు ఇచ్చారు. గతంలో మాదిరి అందరికీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేయరు. పెన్షన్ పొందే వారిలోకొంతమందికి ఇంటివద్ద పెన్షన్ నగదు పంపిణీ, మిగిలిన వారికి గ్రామ,వార్డు సచివాలయాల వద్ద పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగులు,తీవ్ర అనారోగ్యం తో బాధపడేవారు,అస్వస్థతకు గురైనవారు, మంచాన పడ్డవారు,వృద్ద వితంతువులకు ఇంటివద్ద పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
గ్రామ సచివాలయాలకు చాలా దూరంగా ఉన్న వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు పంపారు. 2లక్షల 66 వేల 158 మంది వాలంటీర్లు ఉంటే లక్షా 27వేల 177 మంది మాత్రమే సచివాలయ సిబ్బంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాగే సచివాలయ సిబ్బందిలో కొంతమందికి ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల విధులు అప్పగించింది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో రెండు కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ల పంపిణీ సమయంలో ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకూ సచివాలయాలు పనిచేయాలని ఉత్తర్వులో వెల్లడించారు.