ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) అమలులో భాగంగా ఐబీ ప్రతినిధుల బృంధం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని మౌలికవసతులు, పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగా మెక్సికో దేశానికి చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో మంగళవారం జనవరి 6, 2024 న కృష్ణా జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు.
ముందుగా ఆల్డో విజయవాడలోని ఎంకే బేగ్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్లోని గదులను, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్ల వినియోగం, ఉపాద్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యకై అడుగులు వేస్తూ విద్యార్ధులకు ట్యాబ్ అందించింది. వాటి పనితీరును గురించి ఆల్డో అడిగితెలుసుకున్నారు. ఆల్డో పిల్లలను బోధనా అంశాలపై ప్రశ్నలు వేసి వారు చెప్పిన సమాధానాలు విన్నారు.
తరువాత ఆల్డో జగనన్న గోరుముద్దను రుచి చూసి.. మధ్యాహ్న భోజనం వంట కార్మికులను అభినందించారు. అనంతరం కంకిపాడు మండలం పునాదిపాడు, ఈడుపుగల్లు జెడ్పీ హైస్కూళ్ళను సందర్శించారు. పునాదిపాడులో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, ఈడుపుగల్లులో డ్రాయింగ్ ప్రదర్శన, సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ‘ఇండియన్ యోగా’ ప్రత్యేక ప్రదర్శనకు ఆల్డో ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని విద్యా విధానం, ఉపాధ్యాయుల బోధనాతీరు, విద్యార్ధుల చురుకుతనం ఆల్డో ను ఆకట్టుకున్నాయి.
ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి, అడ్మిషన్ విధానంపై ప్రిన్సిపల్‌ను ఆరా తీశారు. విద్యార్థినుల వివరాలు, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులకు వెళ్లి బోధనా అభ్యసన పద్ధతులను పరిశీలించారు. అక్కడ గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసాను విద్యార్థినులు ప్రదర్శించారు.
స్కూళ్ల సందర్శన అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా నడిపిస్తుందని.. మౌలికవసతులు, విద్యావిధానం, డిజిటల్ బోధనా ఆకట్టుకున్నాయంటూ ఆల్డో ప్రశంసించారు. ఈ పర్యటనలో ఐబీ ప్రతినిధి వెంటఎన్టీఆర్, కృష్ణా జిల్లాల విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ వై.గిరిబాబు యాదవ్, డీసీఈబీ సెక్రటరీ ఉమర్ అలీ ఉన్నారు.