నేను నిప్పునని నిత్యం చెప్పే చంద్రబాబు.. అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయి నన్ను మీరే కాపాడుకోండి.. రక్షణ వలయంగా నిలబడండి.. అంటూ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పాడు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అదే జనంలోకి వెళ్లేందుకు ముఖం చెల్లదనే భయం ఆయన్ను వెంటాడుతోంది. అయితే వెళ్లక తప్పదు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు బాబును రా కదలి రా అంటున్నారు. మరోవైపు అవినీతి చక్రవర్తికి సంబంధించిన కేసుల్లో బెయిల్ పిటిషన్లు, వాయిదాలు రా కదలిరా అంటూ కోర్టులకు పిలుస్తున్నాయి. అలా అని లోకేశ్‌కు మొత్తం బాధ్యతలు అప్పజెప్పలేడు. చినబాబు జనంలోకి వెళ్తే ఏమి జరుగుతుందో బాబుకు బాగా తెలుసు.
ఎన్నికల నేపథ్యంలో బాబు కొద్దిరోజులుగా రా కదలి రా పేరుతో సభలు నిర్వహిస్తున్నాడు. ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. పాత సీడీనే మళ్లీ మళ్లీ వేస్తుంటాడు. జనానికి నేను ఫలానా చేస్తానని చెప్పడు. కాసేపు జగన్‌ను తిడతాడు. మరికాసేపు ఆ ఊరి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై అబద్ధాలు అందుకుంటాడు. ఇంకాసేపు సెల్‌ఫోన్ నేనే తెచ్చా.. టెక్నాలజీ నా పుణ్యమే.. హైదరాబాద్ కట్టించానంటూ పిచ్చిపిచ్చి మాటలు చెప్పి విసిగిస్తాడు. అందువల్ల బాబు సభలంటే ప్రజలు విరగబడి నవ్వుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో తిరగకపోతే బాగుండదని నేతలు చంద్రబాబును పిలుస్తున్నారు. దీంతో రా కదలి రా సభలు పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని జరిగాయి. ఈనెల 27వ తేదీ నుంచి మూడురోజుల్లో పీలేరు, ఉరవకొండ, నెల్లూరు రూరల్, పత్తికొండ, రాజమహేంద్రవరం రూరల్, పొన్నూరు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేశారు. తర్వాత మరికొన్ని ఉంటాయి.
కేసులు పిలుస్తున్నాయి
అటు తెలుగుదేశం.. ఇటు జనసేన వ్యవహారాలన్నీ చంద్రబాబే చూసుకోవాలి. చినబాబును భరించేకంటే పెదబాబే మేలని టీడీపీ నాయకులు సభలకు పిలుస్తున్నారు. జనంలోకి వెళ్తే కేసుల గురించి ప్రశ్నిస్తారని భయం నారా వారికి ఉంది. అయినా వెళ్లకపోతే నాయకులు, కార్యకర్తలు ఢీలా పడిపోతారని ఆందోళన ఉంది. మరోవైపు ఎన్నికలకు డబ్బు సర్దుకోవాలి. జగన్, వైఎస్సార్ కాంగ్రెస్‌పై కుట్రలు చేయాలి. ప్రజలను మోసం చేసేందుకు ప్లాన్లు వేయాలి. అధికారం కోసం కుట్రపూరిత రాజకీయాలు చేస్తుంటే.. బాబుకు కోర్టుల నుంచి పిలుపులు ఆగడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించగా ఇప్పుడు వాటికి సంబంధించిన పలు కేసులు కోర్టుల్లో ఉన్నాయి. అందులో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. ఈ కేసులో బాబు హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నాడు. క్వాష్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేయలేదు. మరోవైపు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో ఉంది. దీని తదుపరి వాయిదా ఫిబ్రవరి 12వ తేదీన జరుగుతుంది. ఇదిలా ఉండగా ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో బాబు ఈనెల 10వ తేదీన హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడు. దీనిని రద్దు చేయాలని కోరుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రభుత్వం తరఫున లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. నారా వారా బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈనెల 29వ తేదీన ఈ కేసు విచారణకు వచ్చే అవకాశముంది.
ఏమి చేస్తాడో..
అవినీతి చేసినా దొరకనని, న్యాయస్థానాల్లో తన మనుషులున్నారని, ఈ వ్యవస్థలు ఏమి చేయలేవని చంద్రబాబు విర్రవీగాడు. అయితే అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. ఇదే నిజం. ఓ పక్క వైఎస్సార్సీపీ ఎన్నికల రేస్‌లో ముందుండటంతో టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. అందువల్లే బాబును జనంలోకి రమ్మంటున్నారు. మరోపక్క చేసిన అవినీతి పాపాలకు సంబంధించిన కేసులు కోర్టుల చుట్టూ తిరగమంటున్నాయి. ఈ విషయాలను లోకేశ్‌కు వదిలేయలేక బాబే లాయర్లతో సంప్రదింపులు చేసుకోవాల్సిన పరిస్థితి. రా కదలి రా అంటూ ప్రజల్ని పిలుద్దామని ఆయన బయలుదేరితే న్యాయస్థానాలు ముందు అవినీతి లెక్కలు తేల్చుకుందాం రా అంటూ పిలుపులు ఇస్తున్నాయి. చినబాబు మాత్రం డాడీ తననెప్పుడు రా కదలి రా అంటాడా అని ఎదురు చూస్తున్నాడు.