రేవంత్ రెడ్డి అనే పేరు ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశం. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఒకే ఒక్క రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షుడు. తెలంగాణలో డెబ్బైకి పైగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన వ్యక్తి. కేసీఆర్ ని ఢీకొన్న ధైర్యవంతుడు. ఆరు నెలల ముందు వరకూ విజయానికి దరిదాపుల్లో కూడా లేని కాంగ్రెస్ పార్టీ విజయబావుటం ఎగరేయటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి.
ఇప్పుడు కాంగ్రెస్ 64 సీట్లు తెచ్చుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇంకా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది తేలలేదు. పైన చెప్పిన కారణాలు చూసుకుంటే ఎవరైనా కళ్లు మూసుకుని రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అని ఠక్కున చెప్పేస్తారు. కానీ పరిస్థితి అలా అనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం పై ఇంకా చర్చలు జరుగుతున్నట్టు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీలో ఈ కుర్చీలాటలు సాధారణం. అయినా, కర్ణాటకలో ఇద్దరు హేమహేమీలు అయినా సిద్దరామయ్య, డీకే శివ కుమార్ల సమస్య కూడా ఒక్క రోజులో తేల్చింది. కానీ తెలంగాణాలో రేవంత్ ఒక్కడే పోరాటం చేసి గెలిపించాడు అని తెలిసినా అతడిని ముఖ్యమంత్రి అని చెప్పలేకపోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయనిపిస్తోంది.
అందులో కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.
1. ఓటుకు నోటు కేసు: 2015లో స్టీఫెన్సన్ కి 50లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ రెడ్డి మీద ఆ కేసు ఇంకా నడుస్తోంది. పెట్టిన సెక్షన్లు అతనిని ఇబ్బంది పెట్టలేకపోవచ్చు కానీ ఆ మరక అతడిని ఒక టీడీపీ ఏజెంట్ గానే గుర్తు చేస్తుంది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి నీ ఈ కేస్ మీద విమర్శిస్తూనే ఉన్నారు.
2. టీడీపీతో సాన్నిహిత్యం: చాలా ఇంటర్వ్యూలల్లో రేవంత్ రెడ్డి చంద్రబాబుని పొగటడం అందరూ చూసే ఉంటారు. చంద్రబాబు రాజకీయ పుట్టుక కాంగ్రెస్ లో జరిగినా, తెలుగుదేశంలోకి వెళ్లాక అతని విధానాలన్నీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అది చాలా మంది కాంగ్రెస్ నాయకులకి ఇప్పటికీ కంటగింపుగానే ఉంటుంది. అలాంటిది రేవంత్ రెడ్డి చంద్రబాబుని పొగడడం అంటే టీడీపీ విధానాలు నెత్తిన పెట్టుకోవడమే అనేది వాళ్ల భావన కావచ్చు. రేపు ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు పెత్తనం ఉంటుందేమో అనే అభద్రతాభావం ఉండటంలో తప్పులేదు.
3. టీడీపీ అత్యుత్సాహం: ఎలక్షన్ల ముందు తరవాత టీడీపీ వాళ్లు చేసిన అత్యుత్సాహం కూడా ఒక కారణం. “కేసీఆర్ నిన్ను ఓడించడానికి చంద్రబాబు అవసరం లేదు, అతడి శిష్యుడు రేవంత్ రెడ్డి చాలు” అనే రీల్స్ బాగా తిరిగాయి. కాంగ్రెస్ గెలవగానే టీడీపీ వాళ్లు కాంగ్రెస్ ఆఫీసు ముందు జెండాలు ఎగరేయడం లాంటి పనులు చెయ్యడం కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక రకమైన అభద్రతా భావం కలిగించిందని చెప్పొచ్చు. ఆరోజు ఎగిరిన ప్రతీ జెండా బాబు-రేవంత్‌ల సాన్నిహిత్యాన్ని తెలియజేస్తుంది.
4. రేవంత్ చరిష్మా: ఆల్రెడీ చరిష్మా ఉన్న నాయకులైన పీవీ నరసింహారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పట్టు కోల్పోయి, పూర్తిగా ఆ నాయకుల కనుసన్నల్లో నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాదాపు అదే కోవలోకి వస్తాడు. దీనికి తోడు టీడీపీ మనిషి అవ్వడం కాంగ్రెస్ పార్టీకి మరింత ప్రమాదకరం అనే భావన కూడా ఉంటుంది కాంగ్రెస్ అధిష్టానానికి.
కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుండా అయినా ఉండగలదేమో గానీ లోపల ధిక్కార స్వరం వినిపిస్తే తట్టుకోలేదు. రేవంత్ ముఖ్యమంత్రి అయితే జరిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని తీసుకోవడంలో తాత్సారం చేస్తోందనిపిస్తోంది. ఒకరకంగా టీడీపీ తో సంబంధాలు, టీడీపీ అత్యుత్సాహం రేవంత్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని నీరుగారుస్తున్నాయనేది నిర్వివాదాంశం.