ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్అభ్యర్థి వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఆమె పై కేసు నమోదు చేశారు. మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రసంగించారని.. షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు.
ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించకూడదని కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వైఎస్ షర్మిల.. వివేకా హత్య కేసును ప్రస్తావించారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రచారంలో పదే, పదే ప్రస్తావిస్తున్నారని.. ఎవరూ ఈ అంశంపై మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే, ఆ అంశం పైన విచారణ జరిపిన కోర్టు వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించింది. కడప కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్లిన వైయస్ షర్మిల, వైయస్ సునీత, బీటెక్ రవిలకు హై కోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలను పాటించకపోవడం కోర్టు ఉల్లంఘన క్రిందికి వస్తుందని అధికారులు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.