వైయస్సార్ కుమార్తెగా ఎంతో విలువను సంపాదించుకోవాల్సిన షర్మిల తన అనాలోచిత నిర్ణయాల వలన రోజు రోజుకు తన ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారు. తొలుత తెలంగాణలో పార్టీ పెట్టి ఆ పార్టీని నడలేక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆమె, ఏపీ ఎన్నికలు వచ్చేసరికి ఏపీసీసీగా తెరపైకి వచ్చారు. సొంత అన్న జగన్ పైనే పసలేని ఆరోపణలు చేస్తూ కుటుంబ సమస్యలను ప్రజా సమస్యలుగా చూపే ప్రయత్నం చేసి ప్రజల మనసులు గెలుచుకోవడంలో విఫలం చెందారు.
ఇదిలా ఉంటే వైయస్సార్ గారి పేరును ఆయన మరణానంతరం జగన్ పై కక్షతో సీబీఐ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ లో చేర్చడంతో వైయస్సార్ అభిమానులు తీవ్రంగానే స్పందించారు. ఊరూ వాడా అని లేకుండా కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మాడి రాజీనామాలు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. తన తండ్రిని దోషిగా చూపే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీతో దశాబ్దం దాటిన తరువాత షర్మిల చేతులు కలపడం వైయస్సార్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇదేం పని అని అంటూ అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు తీవ్రంగానే స్పందించారు.
కాగా ఎన్నికల్లో షర్మిలను అడ్డు పెట్టుకుని వైయస్సార్ చరిష్మాని వాడుకుని ఓట్లు పొందుదాం అని ఆశపడిన కాంగ్రెస్ పెద్దలకి ప్రజలే షాక్ ఇచ్చారు. కనీసం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను కన్నెత్తి కూడా ప్రజలు చూడలేదని సర్వేలు చెబుతున్న సత్యం. షర్మిలే ప్రచార బాధ్యతలు తన భుజాన్న వేసుకుని ఊరూరూ తిరిగినా ప్రజల నుండి నామమాత్రపు స్పందన కూడా లేదు. దీంతో కాంగ్రెస్ మరోసారి తన బుద్దిని బయట పెట్టుకుంది, ఆ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ చేత నేరుగా షర్మిలనే టార్గెట్ చేయించింది. ఆమెపై అనేక ఆరోపణలు చేయించింది.
నెల్లూరులో విలేకర్లతో కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎవరితో చర్చించకుండా టిక్కెట్లు కేటాయించారని, టికెట్లకు ఎవరు డబ్బులు ఇచ్చారో, ఇవ్వలేదో పూర్తి వివరాలు ప్రజలకు తెలియాల్సి ఉందని, ఎన్నికల్లో ఆమె వ్యూహం తప్పయిందని, ఇది రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ కాదని, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ అని షర్మిలపైన తీవ్రమైన విమర్శలే చేశారు. దీంతో కాంగ్రెస్ తన రంగును మరోసారి బయటపెట్టుకుందని షర్మిలా ఇప్పటికైన తప్పు తెలుసుకుని మెలగాలని వైయస్సార్ అభిమానులు చెబుతున్న మాట.