ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్న నేపథ్యంలో సీఎం జగన్ పర్యటన సాగనుంది.
డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని చెప్పి ఆ హామీని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారు. దాంతో పొదుపు సంఘాలన్నీ అప్పుల్లో కూరుకుపోయాయి. పొదుపు సంఘాల మహిళలను ఆదుకోవడానికి వారి పేరిట ఉన్న రూ.25,570.80 కోట్ల అప్పును వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో నాలుగు విడతల్లో చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మూడు విడతలుగా రూ.19175.97 కోట్ల సొమ్ము చెల్లించారు. రేపు ఉరవకొండలో జరగనున్న వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో నాలుగో విడతగా మిగిలిన రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని జగన్ ప్రభుత్వం చెల్లించబోతోంది. చంద్రబాబు మోసంతో పతనావస్థకు చేరిన డ్వాక్రా వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే కాకుండా వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.14,129 కోట్లు , సున్నా వడ్డీ పథకం కింద రూ.4,969 కోట్లు, మొత్తంగా రూ.38,274 కోట్లు మహిళలకు ఇచ్చి వారికి ఆర్థిక భరోసా కలిగించారు.
కాగా ఉరవకొండ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.