విద్యాశాఖపై సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఐబీ విద్యాబోధన, ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్‌లో ముందడగుపై జగన్ సమీక్షించారు. విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
2025-26 నుండి ఐబీ విద్యా బోధన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐబి విద్యాబోధన అమలుచేయనుంది. ఇందుకోసం ఐబీ ప్రతినిధులతో జనవరి 31న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇందులో భాగంగా వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాశాఖలో టీచర్లు, ఎంఈఓలు, డీఈఓలు సహా సిబ్బంది అందరికీ ఐబీ ప్రతినిధులు ఐబీ బోధనపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 2025–26 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఐబీ విద్యాబోధనను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ అంశాన్ని పాఠ్యప్రణాళికలో పొందుపరిచే కార్యక్రమాన్నీ త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా ఫైనాన్షియల్ లిట్రసీలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని , దీనివల్ల ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఏర్పడుతుందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. 8వ తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా ఫ్యూచర్ స్కిల్స్ బోధించేందుకు చర్యలు తీసుకున్నామని ఇప్పటికే ఒక సెమిస్టర్‌కు సంబంధించి సిలబస్ రూపొందించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కాగా ప్రతి మూడు పాఠశాలలకు ప్యూచర్ స్కిల్స్‌పై ఒక నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే 2066 మంది ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్‌పర్ట్‌లను వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో గుర్తించామని, వారికి గౌరవవేతనం చెల్లిస్తున్నామని అధికారులు వెల్లడించారు.