రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్ధాయి ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులను ముఖ్యమంత్రి జగన్ అందజేయనున్నారు.
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి చివరి రోజైన రేపు ప్రధానంగా క్రికెట్, బాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఆటల్లో పురుష, మహిళా విభాగాల్లో ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి . ఆరంభం నుండి ఆసక్తి గొలుపుతూ సాగిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో ఫైనల్ మ్యాచ్లు జరుగుతున్న రేపటి రోజున ముఖ్యమంత్రి జగన్ కూడా రానుండడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలిరావచ్చన్న అంచనాల మేరకు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
రేపు 13-02-2024 మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు, అక్కడ పీఎం పాలెం వైఎస్సార్ క్రికెట్ స్టేడియంకు చేరుకుని క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించిన తర్వాత విజేతలకు బహుమతులు ప్రధానం చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు. ముఖ్యమంత్రి విశాఖ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.