రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి కృష్ణలంక కనకదుర్గ వారధి వద్దకు చేరుకుంటారు. ప్రజల దశాబ్దాల కల అయిన ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రారంభోత్సవం చేస్తారు. కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన భూ పట్టాలకు సంబంధించి శాశ్వత హక్కులు కల్పించారు. దీని ధ్రువీకరణపత్రాలను సీఎం లబ్ధిదారులకు అందజేస్తారు. అనంతరం తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
విజయవాడ అభివృద్ధిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా రిటైనింగ్ వాల్‌ను నిర్మించింది. గతంలో దీని గురించి ప్రజలు అడిగినా ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి తప్ప పట్టించుకున్న పాపాన పోలేదు. నగరంలో ఎంతోమంది పేదలు సొంతిల్లు లేక అష్టకష్టాలు పడుతున్నారు. వారిని గుర్తించిన జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందజేయడం చారిత్రాత్మక విషయం. వీటికి శ్రీకారం చుట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.