పల్నాడు జిల్లా ఈవూరివారిపాలెం డొంక సమీపంలో ఓటు వేసి తిరిగి వస్తుండగా జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయిన ఘటన తెలిసిందే. ఈ దుర్ఘటన కు సంభంధించి సీఎం జగన్ స్పందించారు. బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించడంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి తిరిగి వస్తుండగా ట్రావెల్స్ బస్సు – టిప్పర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మంటలు వ్యాపించి రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నట్లు తెలుస్తుంది. మృతుల్లో టిప్పర్ డ్రైవర్, ట్రావెల్ బస్ డ్రైవర్ తో పాటు మరో నలుగురు బస్సులోని ప్రయాణికులు సజీవదహనం అయ్యారని తెలుస్తుంది. మృతుల వివరాలు చూస్తే బస్సు డ్రైవర్ అంజి, మధ్యప్రదేశ్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్ హరిసింగ్, నీలాయపాలెంకు చెందిన కాశీ బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి, శ్రీసాయి గుర్తించారు. మరొకరి వివరాలు తెలియ రాలేదు.