ఆంధ్రప్రదేశ్ లో 75 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించగా ఈ కార్యక్రమంలో సీఎం అదనపు కార్యదర్శి భరత్ గుప్తా పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఏపీ సచివాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహార్‌రెడ్డి ఆవిష్కరించారు. అసెంబ్లీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవిష్కరించగా శాసనమండలి ఆవరణలో జాతీయ జెండాను మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు నివాళులర్పించారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ శ్రీ అబ్దుల్ నజీర్, సీఎం శ్రీ వైఎస్.జగన్, శ్రీమతి వైయస్.భారతితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను గవర్నర్ జస్టిస్ శ్రీ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ పథకాల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.