ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు,రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం నిధులు విడుదల, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గురించి ప్రత్యేకంగా చర్చించడంతో పాటు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని ప్రధానిని కోరారు.
ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్, కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం చేయాలని, ఏపీఎండీసీ కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు. కాగా చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తూ అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కానీ సీఎం జగన్ ఎలాంటి రాజకీయ అంశాల ప్రస్తావన లేకుండా రాష్ట్రాభివృద్ధి ప్రధాన అజెండాగా ప్రధాని మోదీతో చర్చించినట్లు సమాచారం.