ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి గుడి అభివృద్ధికి వైయస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఇప్పటికే దుర్గగుడి అభివృద్ధికి సుమారు 216 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా నేడు పలురకాల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేయడంతో పాటు ఇప్పటికే పూర్తయిన మల్లేశ్వరాలయంతో పాటు పలు ఆలయాలను ప్రారంభించారు.
సెలవు రోజులు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల రోజుల్లో దుర్గ గుడికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో సౌకర్యాల కల్పనకోసం దేవాదాయ శాఖ నడుం బిగించింది. దుర్గ గుడి అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. దుర్గగుడి అభివృద్ధి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.70 కోట్లను విడుదల చేసింది. ఆ నిధుల నుంచి రూ.4.25 కోట్లతో ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు,తుది దశలోని శివాలయం నిర్మాణం కోసం రూ.5.60 కోట్లు, మండపం పనుల కోసం రూ.2.05 కోట్లు వెచ్చిస్తున్నారు. రూ.3.25 కోట్లతో చేపట్టిన ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, స్కాడా పనులు పూర్తి కావడంతో వీటిని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. దేవదాయ శాఖ నిధులు రూ. 3.87 కోట్లతో చేపట్టిన 8 ఆలయాల పునఃనిర్మాణ పనులు పూర్తి కావడంతో ఆయా ఆలయాలను కూడా ప్రారంభించారు.
216 కోట్లను ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు వెచ్చించనున్న దేవాదాయ శాఖ
లడ్డూ ప్రసాదం పోటు నిర్మాణానికి రూ.27 కోట్లు, రూ.30 కోట్ల వ్యయంతో అన్నదాన భవన నిర్మాణం చేయనున్నారు. కనకదుర్గా నగర్ నుంచి మహా మండపానికి అనుసంధానిస్తూ రూ.13 కోట్లతో నిర్మించనున్న ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులతో పాటు రూ. 23.50 కోట్లతో దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. రూ. 15 కోట్లతో రాజగోపురం ముందు భాగం వద్ద మెట్ల నిర్మాణం చేపట్టి , రూ. 7. 75 కోట్లతో కనకదుర్గానగర్ ప్రవేశం వద్ద మహారాజ ద్వార నిర్మాణం, రూ. 19 కోట్లతో నూతన కేశఖండన శాల నిర్మాణం, రూ. 18.30 కోట్లతో మల్లికార్జున మహా మండపం వద్ద క్యూ కాంప్లెక్స్ మార్చడంతో పాటు, రూ. 10 కోట్లతో ప్రస్తుత గోశాల భవనాన్ని బహుళ సముదాయంగా మార్చనున్నారు.