శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును, రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్-200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సీఎం జగన్ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖలు చేసిన ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నిలబడిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదని ఎద్దేవా చేశారు.
ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్థం. ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూసి ఉద్దానం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం అధికారంలోకి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకువచ్చాము. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదు. గత పాలకుల హయాంలో కూడా ఉంది. కుప్పం నియోజవర్గానికి కూడా చంద్రబాబు నీరు అందించలేదు. సొంత నియోజవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఎలా ఉంటుంది? పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్క లేదని సీఎం జగన్ మండి పడ్డారు.
ఎన్నికలు వస్తే చాలు చంద్రబాబు ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద ఆధారపడతారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టినా ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చేయని ద్రోహం లేదు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాల్లో నిర్ణయిస్తారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. కాగా సీఎం జగన్ ప్రారంభించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు, డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కారణంగా ఉద్దానం పరిసర ప్రాంత ప్రజలకు కొత్త ఊపిరి వచ్చినట్లయింది.