సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులతో పోలిస్తే దూకుడుగా ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు పడనుంది. పిఠాపురం వేదికగా జరగబోయే బహిరంగ సభతో సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా 44 రోజుల్లో ఏకంగా 118 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం నిర్వహించడం విశేషం. చివరి 12 రోజుల్లో 34 సభల్లో జగన్ పాల్గొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన సీఎం జగన్ తన చివరి సభను పిఠాపురంలో నిర్వహించనున్నారు. వైసీపీ తరపున పోటీ చేస్తున్న వంగా గీతను గెలిపించాలని సీఎం జగన్ పిఠాపురం వేదికగా పిలుపునివ్వనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో ఆ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కాగా సీఎం జగన్ తాను మంచి చేసి ఉంటేనే తనకు ఓటేయమని ప్రజలకు పిలుపునిస్తుంటే మరోవైపు ఒంటరిగా సీఎం జగన్ ను ఓడించలేమనే నమ్మకంతో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా బరిలోకి దిగి అసత్యాలను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కుతంత్రాలకి తెరతీశారు. కానీ ప్రజలు ఆ అసత్య ప్రచారాలను విశ్వసించడం లేదనే చెప్పాలి. తాజాగా పిఠాపురంలో సీఎం జగన్ చివరి బహిరంగ సభ నిర్వహిస్తున్న తరుణంలో ఆ సభలో సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారోనని ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.