వైయస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం కార్యక్రమంపై అధికారులతో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 18న కార్యక్రమం ప్రారంభం నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ “ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడ్డం ప్రభుత్వ బాధ్యత. అందుకే అధికారంలోకి వచ్చిన రోజునుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసింది. వైయస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వంచేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ. దీంట్లో భాగంగానే వైయస్సార్‌ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టాం. వైయస్సార్‌ఆరోగ్య శ్రీ కార్డు ఉందంటే రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుంది. ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు(ఫాలో అప్ కన్సల్టేషన్) రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలి. వైయస్సార్‌ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్నదానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలి.
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలి. స్క్రీనింగ్, మందులు, చికిత్స తదితర అంశాల్లో కిడ్నీ రోగులకు బాసటగా నిలవాలి. డయాలసిస్ పేషెంట్లు (సీకేడీ) వాడుతున్న మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలి. ఫ్యామిలీ డ్యాక్టర్ కాన్సెప్ట్‌తో అనుసంధానం చేయాలని ఆదేశం.
మార్కాపురంలో కూడా పలాస తరహా వైద్య చికిత్సా సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. కొత్తగా కడుతున్న మెడికల్ కాలేజీలో ఇప్పటికే నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతోపాటు యూరాలజీ డిపార్ట్మెంట్ కూడా తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
జనవరి 1 నుంచి ఫేజ్2 జగనన్నఆరోగ్య సురక్ష శిబిరాలు
రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు విజయవంతం అయిన సంగతి తెలిసిందే. జనవరి 1 నుండి ఫేజ్ 2 ఆరోగ్య సురక్ష శిబిరాలను ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో, అర్బన్ ప్రాంతాల్లో వారంలో ఒక వార్డులో ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం, సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు అర్బన్ ప్రాంతాల్లో మాత్రం బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు కొనసాగనున్నాయి.