తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా చలామణి అయ్యే దెందులూరు మాజీ శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ మరోసారి తన రౌడీయిజం చూపించారు. జగన్ ప్రభుత్వంలో తనకి జరిగిన మేలుని చెప్పిన దళిత యువకుడి పై దాడికి తెగబడ్డారు. చింతమనేని చేసిన ఈ దాష్టికానికి దళిత సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. 93 కేసులు ఉన్న ఓ రౌడీ షీటర్ కి చంద్రబాబు టికెట్ ఇవ్వడం అంటే అతను చేసే అరాచకాలను దగ్గరుండి ప్రోత్సహించడం కాదా అంటూ దెందులూరు వాసులు వాపోతున్నారు. చింతమనేని లాంటి అరాచక శక్తులకి రాజకీయ సమాధి కడతామని దళిత సంఘాలు చంద్రబాబుని తీవ్రంగానే హెచ్చరించాయి.
వివరాలలోకి వెళితే పెదవేగి మండలం లక్ష్మీపురం కూచిపూడి రామసింగవరం గ్రామాల్లో చింతమనేని, తన అనుచరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలోనే యర్ర చంటిబాబు అనే దళిత యువకుడు జగన్ ప్రభుత్వంలోనే తమకు మేలు జరిగిందని, జరిగిన మేలుని లెక్కలతో వివరించ ప్రయత్నం చేశాడు. దీంతో తీవ్రంగా రెచ్చిపోయిన చింతమనేని అనుచరులు చంటిబాబుపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన మరికొందరు యువకులపైనా దాడి చేశారు. ఈ దాడిలో గాయాలపాలైన యువకుల్ని అక్కడి ప్రజలు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి, ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఆస్పత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు.
చింతమనేని దళిత వాడల్లోకి వెళ్ళి మరీ దళితులపై దాడి చేయడం అతని రౌడీ మనస్తత్వానికి నిదర్శనం అని ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ బుద్ది చెప్పి దెందులూరు లో రౌడీ సంస్కృతికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ప్రజలందరు అప్రమత్తంగా ఉండి ఓట్లు వేసి వీరికి రాజకీయ సమాధి కట్టాలని దళిత నాయకులు తమ అభిప్రాయాలను వెళ్ళబుచ్చారు.