తండ్రీకొడుకులు చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఎన్నికల ఎన్నికల సభల్లో నోటికొచ్చిన హామీలు ఇచ్చేస్తున్నారు. ఇందులో ఒకటి తెలుగుదేశం – జనసేన ప్రభుత్వం రాగానే యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటిస్తున్నారు. తాజాగా నరసన్నపేట, శ్రీకాకుళంలో నిర్వహించిన టీడీపీ శంఖారావం బహిరంగ సభల్లో లోకేశ్ మాట్లాడారు. మళ్లీ 20 లక్షల ఉద్యోగాల గురించి చెప్పారు. అయితే మరో విషయాన్ని స్పష్టం చేసి తమ బుద్ధిని బయటపెట్టారు. ఉద్యోగం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందజేస్తామన్నారు. దీనిని బట్టి తమకు జాబ్‌లు ఇచ్చే ఆలోచన లేదని చెప్పకనే చెప్పేశారు. అయితే ఆ భృతి సక్రమంగా ఇస్తారంటే అదీ లేదు. ఒకసారి గతం చూస్తే తండ్రీకొడుకులు, ప్రశ్నిస్తానని చెప్పి వదిలేసిన పవన్ కళ్యాణ్ యువతను చేసిన మోసం ఏంటో తెలుస్తుంది.
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రతి ఇంటికీ ఉద్యోగం, లేని పక్షంలో రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే దీనిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ భృతి నాటకానికి తెరతీశారు. దీనికి సవాలక్ష కొర్రీలు పెట్టడం గమనార్హం. 2018 అక్టోబర్ 2018 నుంచి యువనేస్తం పేరుతో తెలుగు తమ్ముళ్లు చెప్పిన కొందరికే డబ్బు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.
2019 ఎన్నికల సమయంలోనూ అదే హామీ ఇచ్చారు. మరోసారి టీడీపీని గెలిపిస్తే నిరుద్యోగ భృతిని పెంచుతామని, ఈసారి ఇంటర్ నుంచే ఇస్తామని బాబు ఆర్భాటంగా చెప్పారు. రూ.1,000తో ప్రారంభించి రూ.2 వేలు చేశామన్నారు. అయితే ఇది ఎన్నికలు వస్తున్నాయని మభ్యపెట్టేందుకు చేశారనే విషయం అందరికీ తెలిసిందే. ఈసారి గెలిస్తే రూ.3 వేలు చేస్తామని ప్రకటించారు. కానీ ఎవరూ నమ్మలేదు. అదే బాబు తాను ఇచ్చిన హామీ మేరకు 14లో గెలిచిన వెంటనే పథకాన్ని ప్రవేశపెట్టి ఉంటే నిరుద్యోగులకు లబ్ధి చేకూరేది. అయితే ఎలక్షన్ స్టంట్ చేసి అభాసుపాలయ్యారు. అసలు మోసం చేయడమే ఆ పార్టీ నైజం. ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచే తొలగించింది. ఎందుకంటే తాము అమలు చేయలేని హామీలు ఇచ్చినట్లు ఆ పార్టీ పెద్దలకు కూడా తెలుసు. 24 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్లీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునేందుకు కొత్త నాటకానికి బాబు తెరతీశారు. గతంలో మాదిరిగానే భృతి హామీని మళ్లీ చెబుతుండటంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఒకప్పుడు జరిగిన మోసాన్ని తలుచుకుని ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ మాటలను నమ్మడం లేదు. అసలు టీడీపీకి ఉద్యోగాలు ఇచ్చే ఉద్ధేశమే లేదు. భృతి ఇచ్చేది కూడా కలే..