వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. వారు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అందులో ఒకటి వైఎస్సార్ చేయూత.. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉన్న మహిళలకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.18,750ను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే మూడుసార్లు నగదు ఇచ్చారు. మొత్తంగా నాలుగు దఫాల్లో రూ.75 వేల ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారు స్వశక్తిపై ఎదిగేందుకు, సుస్థిరమైన జీవనోపాధి పొందేందుకు అవకాశం కలుగుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకూ మూడు విడతల్లో భారీగా నిధుల్ని మహిళలకు అందించారు. ఇంకా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. దీంతో సదరు వారు పాడి పరిశ్రమ, దుకాణాలు తదితరాలు పెట్టుకుని, చిరు వ్యాపారాలకు పెట్టుబడిగా వాడుకొని కుటుంబాలను పోషించుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా అర్హతే ప్రామాణికంగా లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. ఇదొక విప్లవాత్మక పథకం. నాలుగో విడత నిధులను ఈనెల 7వ తేదీన విడుదల చేయనున్నారు.
మహిళలను ఆర్థిక శక్తిగా మార్చేందుకు వైఎస్సార్ చేయూత పథకాన్ని సీఎం 2020 ఆగస్టు 12వ తేదీన ప్రారంభించారు. 23 లక్షల మందికి సాయం చేసేందుకు రూ.17,000 కోట్లను కేటాయించారు. వలంటీర్లు నేరుగా అతివల ఇంటి వద్దకు వెళ్లి దరఖాస్తు చేయించి పథకాన్ని అందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద సహాయం అందించడం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కింది. ఈ పథకం కింద ప్రభుత్వం మహిళల చేత కిరాణా షాపులు పెట్టించింది. ఆవులు, గేదెలు, మేకలు ఇచ్చి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు అందించింది.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని జగన్ నెరవేరుస్తున్నారు. ఆర్థికంగా ఏటా చేయూతనిస్తున్న జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకోలేనిదని మహిళలు అంటున్నారు. నాలుగో విడత చేయూత నిధులను మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ఈనెల 7వ తేదీన అనకాపల్లిలో సీఎం జగన్ ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సభ భారీ ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇప్పటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళల కోసం ఆసరా, అమ్మఒడి, చేయూత, పొదుపు వారికి సున్నా వడ్డీ చెల్లింపులు తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జగన్ తన పదవీ కాలంలో మొత్తంగా రూ.2.55 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.