తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి నిజాలు మాట్లాడడం చాలా కష్టం. అదే అబద్ధాలు చెప్పమంటే మాత్రం పేజీలకు పేజీలు చదువుకుంటూ పోతాడు. చేయని పనులను కూడా చేశానని చెప్పుకోవడం ఆయన స్పెషాలిటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసింది ఏమీ లేకపోయినా ఇప్పటికీ డబ్బా కొట్టుకోవడం మాత్రం ఆపలేదు.
‘దీపం పథకం నేనే పెట్టా. నా తల్లి కష్టాలు చూశా. పొగంతా కడుపులో పోతా ఉంటే నా ఆడబిడ్డలకు ఈ కష్టం రాకూడదని ప్రతి ఇంటికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా’ ఇటీవల తిరుపతి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాటలివి. వాస్తవాలు పరిశీలిస్తే వేరేలా ఉన్నాయి. 1999 సంవత్సరం జూలై నెలలో దీపం పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత పేదలందరికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తామని ప్రకటించారు. కానీ బాబు సంగతి తెలిసిందే కదా. ఏనాడైనా మాటపై నిలబడ్డాడా. అనేక కొర్రీలు పెట్టాడు. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు మాత్రమేనన్నాడు. అంతటితో ఆగాడా అంటే లేదు. చివరికి రివాల్వింగ్ ఫండ్ పొందిన వారు మాత్రమే అర్హులని ప్రకటించారు. దీంతో స్వల్ప సంఖ్యలో మాత్రమే ప్రజలు కనెక్షన్లు పొందగలిగారు. అయితే అందరికీ కనెక్షన్లు ఇచ్చేశామని కిరోసిన్ పంపిణీపై ఆంక్షలు విధించాడు. దీంతో అనేకమంది బ్లాక్లో కొనాల్సిన పరిస్థితులు వచ్చాయి. చివరికి పేద మహిళలు పొగ మధ్య ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కల్పించాడు బాబు. నాడు అందరికీ కనెక్షన్లు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా పట్టించుకోలేదు.
జాతీయ శాంపిల్ సర్వే గణాంకాల ప్రకారం టీడీపీ ప్రభుత్వ హయాం నాటికి ఏపీలో 62 శాతం గ్రామీణ కుటుంబాలు వంట ఇంధనం కోసం కట్టెలు, బొగ్గు, పేడ తదితరాలపైనే ఆధారపడ్డాయి. దీనిని బట్టి దీపం పథకం బాబు పాలనలో ఎంత బాగా అమలైందో చెప్పొచ్చు. ఇప్పుడు ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేస్తానని డబ్బా కొడుతున్నాడు. నోటి మాటే కదా చెప్పేస్తే పోలా అనుకుంటున్నాడు.