తెలుగుదేశం అధినేత చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఆ కాలంలో ప్రజలకు చేసింది శూన్యం. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం ప్రలోభాల బాట పట్టారు. ఆయన ఆదేశాలతో నియోజకవర్గాల్లో నాయకులు ఓటర్లకు బహుమతుల పేరుతో ఎర వేస్తున్నారు. కానీ ఎల్లో గ్యాంగ్ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తోంది. మార్కాపురంలో ఆ పార్టీ ఇన్చార్జి అన్నా రాంబాబు స్వీట్ బాక్స్‌లో డబ్బు పెట్టి పంచుతున్నారని టీడీపీ సోషల్ మీడియా వీడియో పెట్టింది. ఎల్లో మీడియా బాగా దిగజారి జగన్ పార్టీ ప్రలోభాలపర్వం అంటూ రచ్చ చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ బాక్స్ రాంబాబు మనుషులు పంచుతుండగా తీసింది కాదు. దానిని చూస్తే టీడీపీ వాళ్లే వైఎస్సార్సీపీని ప్రజల్లో చులకన చేసేందుకు రాంబాబు పేరుతో స్టిక్కర్ వేసినట్లు ఇట్టే అర్థమైపోతుంది.
అసలు టీడీపీ నాయకులు నియోజకవర్గాల్లో ఏడాది కాలంగా ప్రలోభాలకు తెరలేపారు. పండగల సమయంలో దుస్తులు, నగదు పంపిణీ చేస్తున్నారు. కవర్లు, బాక్స్‌లపై తమవి, బాబు, లోకేశ్ ఫొటోలు వేసుకుని మరీ పంపకాలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. పత్రికల్లో వార్తలు రాయించుకుంటున్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఇది మరీ ఎక్కువైంది. ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు నేతలు దండాలు పెడుతూ తిరుగుతుంటారు. వారి మనుషులు ఎంతో కొంత ముట్టజెప్పే పనులు చేస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ నాయుడు అనే వ్యక్తిని బాబు ప్రకటించారు. ఇతను బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేసి బాగా సంపాదించాడు. టికెట్ కోసం ఆరునెలలకు పైనుంచి ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. యువతకు అడిగినంత డబ్బు ఇస్తున్నారు. ఇదంతా ట్రస్ట్ పేరుతో చేస్తున్నట్లు చూపుతున్నా అంతిమంగా ఓట్లకు గాలం వేయడమే. దీపావళి సమయంలో టపాసులు, దసరా సమయంలో మహిళలకు చీరలు ఇలా ఎన్నో అందజేశారు. కానీ ఇవేవీ ఎల్లో మీడియాకు కనిపించలేదు. పైగా ఆయన్ను సేవా తత్పరుడని ఆకాశానికి ఎత్తేశాయి.
ఇక శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ టికెట్ కోసం కాకర్ల సురేష్ అనే ఎన్ఆర్ఐ లోకేశ్ బొమ్మ పెట్టుకుని చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సేవకు మారుపేరు తానని ఊర్లలో తిరిగారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు ఖర్చు పెట్టి రకరకాల వేషాలు వేశారు. చివరికి టికెట్ సాధించారు. ఎల్లో గ్యాంగ్ ఆయన్ను శ్రీమంతుడిని పొగిడి మురిసిపోయింది.
నెల్లూరు సిటీ టీడీపీ టికెట్ సాధించిన పొంగూరు నారాయణ డబ్బుతోనే రాజకీయాలు చేస్తున్నారు. 2019లో ఓడిపోయిన ఆయన ఈసారి వందల కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారు. విద్యాసంస్థల్లో ఏనాడూ పేద విద్యార్థులకు ఉచితంగా సీటు ఇవ్వలేదని, ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం చేయించలేదని ఆరోపణలున్నాయి. ఇప్పుడొచ్చి ఏమి కావాలన్నా చేస్తానని వార్డుల్లో తిరుగుతున్నారు. తన మనుషుల చేత హామీలు ఇప్పిస్తున్నారు. ప్రతి సెంటర్లో తనకంటూ యువత ఉండాలని, వారికి డబ్బు ఇవ్వాలని ఎన్ టీమ్‌కు చెప్పారు.
ఈ ముగ్గురూ గత నాలుగున్నర సంవత్సరాలుగా ఏనాడూ జనంలో లేరు. ఎన్నికలు సమీపిస్తున్నాయని వచ్చి హడావుడి చేస్తున్నారు. డబ్బే వీరి బలం. జనం మనుషులు కాదు. నారాయణ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 19లో ఓడిపోయాక జనానికి ముఖం కూడా చూడలేదు. కరోనా కాలంలోనూ పట్టించుకోలేదు. ఇప్పుడొచ్చి మీకు డబ్బిస్తా.. నన్ను గెలిపించాలని బతిమాలాడుకుంటున్నారు. ముగ్గురూ నగదును మంచినీళ్లలా ఖర్చు చేస్తుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తదితర మీడియా సంస్థలు వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాయి. తెలుగుదేశం నేతలే వైఎస్సార్సీపీ స్టిక్కర్లు పెట్టి పంపిణీ చేస్తుంటే.. జగన్‌కి ఓటమి భయం పట్టుకుందని ప్రచారం చేస్తున్నాయి. మొదటి నుంచి జనంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అబద్ధాలు చెబుతున్నాయి.
నా వల్ల లబ్ధి పొంది ఉంటే ఓటు వేసి ఆశీర్వదించాలని కోరిన వ్యక్తి జగన్ అనే విషయం మర్చిపోతే ఎలా.. డియర్ నారా వారూ.. చీప్ ట్రిక్స్ చేసే బదులు నేను అధికారంలోకి వస్తే మీకు మంచి చేస్తానని ఒక్క మాట చెబితే సరిపోదా..