తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి వెన్నుపోటుకు దళిత వర్గానికి చెందిన పీతల సుజాత, కేఎస్ జవహర్ బలయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న వీరికి సీట్లు నిరాకరించారు. దీంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుజాత టీచర్‌గా పనిచేసేవారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో తొలిసారి ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గం నుంచి ఎన్నికై చంద్రబాబు కేబినెట్లో పనిచేశారు. 24 ఎన్నికల్లోనూ చింతలపూడి టికెట్ ఆశించారు. అయితే తెలుగుదేశం అధిష్టానం దీనిని సొంగా రోషన్ కుమార్‌కు కేటాయించింది. తనను మోసం చేశారని సుజాత చెబుతున్నారు. 1982 నుంచి మా నాన్న మొదలుకుని మేమంతా పార్టీ కోసం సైనికుల్లా పనిచేశాం.
అవమానాలు ఎదుర్కొన్నా పార్టీని బజారులోకి లాగాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎస్సీ సామాజికవర్గానికి సంబంధించి జిల్లాలో మూడు నియోజకవర్గాలున్నాయి. మాల కింద లేదా మహిళా కోటా కింద ఎక్కడో ఒకచోట చంద్రబాబు అవకాశం ఇస్తారని ఆశించాను. 20 ఏళ్లుగా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న నేను టికెట్ కోసం ఆశపడడంలో తప్పులేదు. 2015 నుంచి నియోజకవర్గంలో కొందరు నాయకులు నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. 2019లో టికెట్ రాలేదు. అప్పటి నుంచి అవమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈసారైనా టికెట్ ఇస్తారన్న నా ఎదురుచూపులు నిరాశనే మిగిల్చాయి. ఎక్కడో ఒకచోట తనకు టికెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
కేఎస్ జవహర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి, 2014లో తెలుగుదేశంలో చేరారు. అప్పుడు ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గంలో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2017లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కింది. ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో తిరువూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 24లో తిరిగి కొవ్వూరు నుంచి పోటీ చేయాలని భావించారు. టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా అధిష్టానం నిరాకరించింది. ముప్పిడి వెంకటేశ్వరరావు కేటాయించడంపై జవహర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా ఇరువర్గాల నడుమ వివాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే చంద్రబాబు ముప్పిడి వైపే మొగ్గు చూపారు. తమ నేతకు అవకాశం ఇవ్వకపోవడంపై జవహర్ వర్గం రగిలిపోతోంది.ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఆయనపై ఒత్తిడి తెస్తోంది. వాడుకుని వదిలేయడం బాబుకు కొత్త కాదు. ఇన్నేళ్ల రాజకీయంలో ఎంతోమంది బాధితులున్నారు. సుజాత, జవహర్ బాధను పట్టించుకుంటారా.. లేక పోతేపోయారులే అని వదిలేస్తారా.