చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే కేసులు నమోదు చేసిన సీఐడీ, దర్యాప్తు వివరాలను ఒక్కొక్కటిగా సేకరిస్తుంది. ఈ కుంభకోణం సూత్రధారులు, పాత్రధారులు, ప్రభుత్వ ఖజానాను గండి కొట్టిన విధానం వంటి విషయాలు విస్తుపోయేలా ఉన్నాయి.
తమ అనుకూల సంస్థలకు అడ్డగోలుగా మద్యం కాంట్రాక్టులు కట్టబెట్టడం, వాటికి అనుకూలంగా చీకటి జీవోలు జారీ చేయడం, ఏటా 1300 కోట్లు కొల్లగొట్టడం చంద్రబాబు హయాంలో జరిగాయి. ఇంత ధనం దోచుకున్నారు బాబు అంటూ కాగ్ రిపోర్ట్ కూడా వచ్చింది.
చంద్రబాబు, కొల్లు రవీంద్ర,అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్ తదితరులు నిందితులుగా ఉన్న ఈ కేసులో, మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజు తొలగించి
అడ్డగోలుగా చంద్రబాబు అండ్ కో కధ నడిపించారని తెలుస్తుంది. ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతోపాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపారు. దానిపై కేబినెట్లో చర్చ కూడా జరగలేదు. కానీ కేబినెట్ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్లీ అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలనే ప్రతిపాదనతో నోట్ ఫైల్ పంపారు. ‘కాపీ టు పీఎస్ టు సీఎం’అని స్పష్టంగా పేర్కొంటూ ఆ నోట్ ఫైల్ పంపడం గమనార్హం.
ఆ వెంటనే డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ చేసింది. అంటే కేబినెట్‌కు తెలియకుండానే వ్యవహారం నడిపింది.
బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరతూ బార్ల యజమానుల సంఘం 2015 సెప్టెంబరు 9న వినతిపత్రం సమర్పించినట్టు చూపించడం గమనార్హం.
బార్ల యజమానుల నుంచి వినతి పత్రం రాకముందే ఆ ఫీజును రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దాన్ని రాటిఫై చేసేందుకు అన్నట్టుగా లేని వినతి పత్రాన్ని ఒకదానిని సృష్టించారు. అక్రమాన్ని కప్పిపుచ్చుకునేందుకు బార్ల యజమానుల పేరిట ఇలా లేఖను సృష్టించినట్టు సీఐడీ గుర్తించింది.
అనంతరం బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది.
అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం.
దాంతో ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారికి త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించాలని నిర్ణయించింది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్ తదితరులపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.