తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో ఎవరికీ అంతుపట్టదు. ఈ విషయంలో ఆయన తన నటనా కౌసల్యాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన జర్నలిస్ట్ సాయితో జరిగిన డిబేట్లో ఈ మాటలు అన్నారు. 90కి పైగా సీట్లు ఇస్తేనే బీజేపీ, జనసేన కలిసి పొత్తులో ఉంటాయని కమలం పెద్దలు షరతు విధించారన్నారు. మరో ప్రతిపాదన కూడా బాబు ముందు పెట్టారంట. అదే టీడీపీని బీజేపీలో విలీనం చేయాలి. దీంతో నారా వారికి టీడీపీ పరిస్థితి, లోకేష్ భవిష్యత్ గురించి బెంగ పట్టుకుందని సంచలన విషయాలను లక్ష్మణ్ చెప్పారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలుగు తమ్ముళ్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
రాజకీయాల్లో చంద్రబాబుని మించిన స్వార్థపరుడు ఉండడు. ఎన్టీఆర్ నుంచి కుర్చీ లాక్కున్నాక బీజేపీతో చేరారు. తర్వాత ఆ పార్టీని వదిలేశారు. దీనికి అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీని, గోద్రా అల్లర్లను కారణంగా చూపించారు. 2014లో చారిత్రక అవసరమంటూ బీజేపీ చుట్టూ తిరిగి వారితో జతకట్టారు. ఈసారి జనసేనను కూడా కలిపారు. ఆ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. ఎంపీలకు కేంద్ర మంత్రి పదువులు తీసుకున్నారు. కొన్నాళ్లు టీడీపీ అధినేత ప్రధాని మోదీ భజన చేశారు. ఆయనంత నాయకుడు లేడని సభలో పొగిడారు. తనే అందరి కంటే సీనియర్ పొలిటీషియన్ అనే బాబు రాజధాని అమరావతి శంకుస్థాపనకు మోదీని పిలిచి సాగిలపడ్డారు. 2019లో కాషాయ పార్టీ అధికారంలోకి రాదని భావించి ఎన్నికలకు కొంచెం ముందుగానే కాంగ్రెస్ వద్దకెళ్లారు. ఎన్టీఆర్ వ్యతిరేకించిన పార్టీకి చెందిన రాహుల్ గాంధీని కలిసి హంగామా చేశారు. ఏపీలో, ఢిల్లీలో కార్యక్రమాలు పెట్టి మోదీని వ్యక్తిగతంగా తిట్టారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ కూడా బాబును తిట్టి పోశారు. పోలవరంను ఏటీఎంలా వాడేశాడని విమర్శించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు పేరుకు మాత్రమే ఒంటరిగా పోటీ చేశారు. తన ప్రయోజనం కోసం జనసేనను వేరే పార్టీలతో కలిపి పోటీ చేయించారు. జనం ఆయన్ను నమ్మలేదు. జగన్‌కు పట్టం కట్టారు.
మళ్లీ భజన
2019లో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయ్యారు. దీంతో బాబు పునరాలోచనలో పడ్డారు. 2014–19 మధ్య తన ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై మోదీ కన్నెర్ర చేస్తారనే భయం ఆయన్ను పట్టుకుంది. దీంతో వెంటనే కాంగ్రెస్‌ను వదిలేసి బీజేపీ రాగం అందుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ప్రధాని, కేంద్ర పెద్దల్ని పొగిడారు. తన ఎంపీలను ఆ పార్టీలోకి పంపారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో కూడా పెట్టుకుని ముగ్గురు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీలోని తన మునుషులను రంగంలోకి దించారు. పురందేశ్వరి ఏపీ అధ్యక్షురాలయ్యేలా చూశారు. ఇప్పుడు ఆమె ద్వారా బీజేపీ పెద్దలకు దగ్గర కావాలని తహతహలాడుతున్నారు. అయితే బాబు సంగతి బాగా తెలిసిన ఆ పార్టీ అధిష్టానం ఆయనకు షరతులు పెట్టినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్నే రాజకీయ విశ్లేషకుడు లక్ష్మణ్ చెప్పారు. వాళ్లు అడిగినట్లు అధిక సీట్లు బాబు ఇవ్వలేరు. విలీనం చేయాలన్నా కష్టమే. ఎందుకంటే కొడుకు లోకేశ్ భవిష్యత్ కోసం జూనియర్ ఎన్టీఆర్ పేరును టీడీపీలో వినపడకుండా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీని కలిపే ధైర్యం చేయలేడు. గతంలో బాబుకు కావాల్సిన నాయకులు బీజేపీలో కీలక స్థానంలో ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను వారు చక్కదిద్దేవారు. అయితే నేడు వాళ్లు లేకపోవడంతో చంద్రబాబుకు కష్టాలు తప్పడం లేదు. బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూ.. సీట్లను ఇంకా ప్రకటించలేదని ప్రచారం జరుగుతోంది.
వారితో కూడా
మరోవైపు కాంగ్రెస్‌తోనూ బాబు టచ్‌లో ఉన్నారు. తెలంగాణలో తన శిష్యుడు రేవంత్‌రెడ్డిని ఆ పార్టీలోకి పంపారు. ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యారు. ఒకవేళ రేపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు దిగులు ఉండదని అనుకుంటున్నారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు పరిస్థితి గందరగోళంగా ఉంది. బీజేపీ పెద్దలు చేరదీయడం లేదనే బాధ ఓ వైపు.. ప్రజల్లో టీడీపీ గ్రాఫ్ పెరగలేదనే బాధ మరోవైపు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.