తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి విలువలు లేవు. రాజకీయాల్లో ఆయన గతం, ప్రస్తుతం చూస్తే ఇదే కనిపిస్తుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజల్లో చులకన చేసేందుకు ఎల్లో మీడియా ద్వారా నిత్యం ప్రయత్నిస్తుంటూనే ఉంటారు. కుట్రలు చేస్తూనే మరోవైపు సూక్తులు చెప్పడంలో మాత్రం వెనక్కి తగ్గరు. నిన్న మొన్నటి వరకు పచ్చ పత్రికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దొంగలని, అవినీతిపరులని, కబ్జాకోరులని రాయించాడు. ఇప్పుడే వారినే బతిమిలాడి టీడీపీలోకి తీసుకుంటున్నాడు. అందుకు ఒక ఉదాహరణ నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్).
జగన్‌ను కార్నర్ చేసేందుకు ఆ మధ్య బాబు ఆంధ్రజ్యోతిలో ఓ వార్త రాయించాడు. 2021లో ఏపీ హైకోర్టులో పనిచేసిన న్యాయమూర్తి కుటుంబంలోని వ్యక్తి వివాహం జరుగుతుండగా జగన్.. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, వేమిరెడ్డిని పంపారు. వారిద్దరూ రూ.2 కోట్లు విలువైన వజ్రాల వాచ్‌ను జడ్జికి బహుమతిగా ఇవ్వాలని చూస్తే విసిరి ముఖాన కొట్టాడు. అంతేకాకుండా వారిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశాడని కట్టుకథ రాసింది. దీంతో టీడీపీ రెచ్చిపోయింది. ధర్మారెడ్డి, వేమిరెడ్డిని తిట్టి వారిపై సీబీఐ విచారణకు జరిపించాలని బాబు మనిషి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వీపీఆర్ రాజ్యసభ్య సభ్యత్వం కొనుక్కున్నారని, తన డబ్బుతో జగన్ కోసం పైరవీలు చేస్తున్నారని విమర్శించారు. ఎల్లో సోషల్ మీడియా, జనసేనలైతే పోస్టులతో రెచ్చిపోయాయి.
కట్ చేస్తే.. నాడు పైరవీల సామ్రాట్, కింగ్ ఆఫ్ లాబీయింగ్‌గా కనిపించిన వేమిరెడ్డి నేడు చంద్రబాబు దృష్టిలో గొప్ప మానవతావాది అయ్యాడు. శనివారం నెల్లూరులో ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు. ‘సాధారణంగా పార్టీలో చేరికలు హైదరాబాద్‌లో లేదా అమరావతిలో జరుగుతాయి. కానీ వేమిరెడ్డి రాజకీయాలకు గౌరవం తెచ్చిన వ్యక్తి. విలువలున్న ఈ మహోన్నతుడిని నేరుగా కలిసి గౌరవంగా పార్టీలోకి ఆహ్వానించేందుకే నెల్లూరుకు వచ్చా’ చేరిక సందర్భంగా నారా వారు మాట్లాడిన ఈ పలుకులను ఆంధ్రజ్యోతి అచ్చేసింది. చదివిన వారు అవాక్కవుతున్నారు. వాచ్ విషయంలో ఎల్లో గ్యాంగ్ తిట్టిన తిట్లను వీపీఆర్ మరిచిపోయి స్వార్థపూరితంగా వ్యవహరించారని విమర్శిస్తున్నారు.
చంద్రబాబు రాజకీయాలు ఇంతే.. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి నాయకులు వచ్చేస్తున్నారని జనంలో హైప్ క్రియేట్ చేసేందుకు రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. మొన్నటి దాకా ఆయన దృష్టిలో అవినీతిపరులు టీడీపీ కండువా కప్పుకోగానే పునీతులైపోతారా.. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని ప్రచారం చేసేందుకు జ్యోతిలో వాచ్ పేరుతో కథనం రాయించారు. వేమిరెడ్డిని అన్నేసి మాటలు అన్నారు. ఇప్పుడు అదే వ్యక్తిని ఎందుకు చేర్చుకున్నట్లు. కేవలం డబ్బు కోసమే కదా.. పైరవీల సామ్రాట్.. నేడు నారా వారి దృష్టిలో రాజకీయాలకు గౌరవం తెచ్చిన వ్యక్తి అయ్యాడంటే దీని వెనుక భారీ ప్రయోజనాలు స్పష్టంగా తెలుస్తోంది.. కేవలం ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడతాడనే వీపీఆర్‌ను ప్రలోభపెట్టారనేది నిజం. చరిత్ర చూసుకుంటే బాబు రాజకీయాల్లో ఒక్క శాతం కూడా నిజాయితీ కనిపించదు. నాటి రూ.2 కోట్ల వాచ్ వ్యవహారం కల్పిత కథ. నేడు నారా వారికి వీపీఆర్ నుంచి భారీగా డబ్బు మూటలు అందింది మాత్రం పచ్చి నిజం.