‘ఇప్పుడు నేను మాట్లాడినవి నిజాలే.. కానీ రేపొకరోజు అలా అనలేదని చెప్పేస్తా. ఎవరిని పడితే వాళ్లని.. ఎలా కావాలంటే అలా తిట్టేస్తా. మళ్లీ అనలేదని చెబుతా. ఒకటి గుర్తు పెట్టుకోండి. నేను నమ్మమంటే నమ్మాలి. నమ్మకూడదంటే నమ్మకూడదు’ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి తీరు ఇలా ఉంటుంది.
గతంలో ఎన్డీఏ నుంచి విడిపోయాక.. బాబు ప్రధాని నరేంద్రమోదీని ఉగ్రవాది అన్నారు. వందల మంది చావుకు కారణమైన వ్యక్తని ఆగ్రహించారు. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు రక్షణ ఉండదని సభల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్డీఏలో మళ్లీ చేరారు. ఈ నేపథ్యంలో తూచ్.. మోదీ అంతటి గొప్ప వ్యక్తి లేడు. భారతదేశం వెలుగొందుతుందంటే ఆయనే కారణమని పొగుడుతున్నారు. ఎల్లో మీడియా బాబు ఎలా చెబితే అలా పాడుతోంది. కానీ జనం ఊరుకోలేదు. నారా వారి పాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ నడిరోడ్డులో నిలబెట్టారు. దీంతో టీడీపీ అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
బీజేపీతో పొత్తు నేపథ్యంలో ముస్లింల ఓట్లు రావని బాబు కొత్త కుట్రలకు తెరతీశారు. ముస్లిం సంఘాలతో సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ అయిన బాబు ఈ విధంగా మాట్లాడారు. ‘వీడియోల్లో నేను మాట్లాడని అంశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్పులు చేసి నాపై వైకాపా దుష్ప్రచారం చేస్తోంది. ఓటమి భయంతోనే జగన్ కుల, మత రాజకీయాలు చేస్తున్నారు. ముస్లింల ప్రయోజనాల విషయంలో రాజీపడం. త్వరలో వారి కోసం ప్రత్యేక డిక్లరేషన్‌ను ప్రకటిస్తాం’ అన్నారు.
ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా దొరికిపోయినా ఆ వాయిస్ తనది కాదని వాదించిన ఘన చరిత్ర చంద్రబాబుది. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక సభల్లో ఏం మాట్లాడారో ప్రపంచం అంతా చూసింది. ఎల్లో పేపర్లు పెద్దపెద్ద అక్షరాలతో అచ్చు వేశాయి. ఇప్పుడు నేను అలా అనలేదంటే నమ్మేందుకు జనం పిచ్చోళ్లు కాదు కదా. సాక్షాత్తు హోంమంత్రి అమిత్‌షా తాము అధికారంలోకి వస్తే ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు తొలగిస్తామని తెలంగాణలో ప్రకటించారు. దీంతో ఎక్కడ పొత్తులో ఉన్న తమకు అన్యాయం జరుగుతుందని బాబు ప్లేట్ తిరగేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పై నెపం నెట్టాలని చూస్తున్నారు. కానీ ఆ వీడియోలు నిజం. షా మాటలు నిజం. విషయం నేరుగా చెప్పి ఓట్లు అడిగితే ఏ సమస్య ఉండదు. ఇలా అడ్డదిడ్డంగా వేరే వాళ్ల మీద తోసి నేను పుణ్యాత్ముడినంటే ఎవరూ నమ్మరు బాబూ.. అయినా ప్రపంచ మేధావి అయిన మీ వాయిస్‌ని ఇమిటేట్ చేసేంత స్థాయి ఏఐకి ఉంటుందా.. ఏదో ఒకరోజు దానిని కనిపెట్టింది నేను అన్నారంటే ఉన్న పరువు కాస్త పోతుంది.