‘నువ్వు అడిగిన టికెట్లు ఇవ్వలేదని ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా.. రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నా. నీ పనితీరు ఏ మాత్రం బాగోలేదు. పోటీ చేస్తే ఉద్ధేశం లేకపోతే వదిలేయాలి. అంతేకానీ ఇలా చేయడం ఎందుకు. ఇంత సీనియర్ నాయకుడివి జనాన్ని సమీకరించలేవా. డబ్బులిస్తారో.. బతిమిలాడుకుంటారో నాకు తెలీదు. రెండు గంటలు టైం ఇస్తున్నా. నేను వచ్చేసరికి జనం కనిపించాలి. లేకపోతే.. నా సంగతి తెలుసుగా..’ అంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆత్మకూరు నియోజకవర్గం అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. రాష్ట్రంలోని సీనియర్ నేతల్లో ఒకడినైన తనను ఇలా చిన్నచూపు చూస్తూ మాట్లాడడం బాధాకరమని ఆనం సన్నిహితుల వద్ద వాపోయాడట.
బాబు శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఆత్మకూరులోని నెల్లూరుపాళెం కూడలి వద్ద ప్రజాగళం సభ పెట్టారు. వాస్తవానికి మధ్యాహ్నం మూడు గంటలకే బాబు రావాల్సి ఉంది. కానీ ఆలస్యంగా సాయంత్రం 5.15 గంటలకు చేరుకున్నారు. ఆనం జన సమీకరణ చేయకుండా చేతులెత్తేశాడు. ఈ విషయం తెలుసుకున్న నారా వారు సభ వద్దకు వచ్చే ముందే ఆయనకు ఫోన్ చేసి తిట్టినట్లు తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో సీనియర్ నేతలు కల్పించుకుని సమీప గ్రామాలు నుంచి ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రజలను తరలించారు. ఒక్కోక్కరికి రూ.1,000 చొప్పున ఇచ్చినట్లు తెలిసింది. ప్రచార రథంపైకి కూటమిలో భాగస్వాములైన బీజేపీ, జనసేన పార్టీ నాయకులను పిలవలేదు. టీడీపీ అభ్యర్థులు నేతలు చెప్పినా.. వాళ్లు చిన్నస్థాయి నాయకులు. ఎవరూ అవసరం లేదులే.. మీరు ఎక్కండి చాలని చంద్రబాబు అన్నారని ప్రచారం జరుగుతోంది.
హెలిప్యాడ్ వద్ద టీడీపీ అధినేతను నియోజకవర్గానికి చెందిన కమ్మ సామాజికవర్గం నేతలు కలిశారు. ఆనం వ్యవహారశైలి ఏ మాత్రం బాగోలేదని, తమను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయనకు అనవసరంగా టికెట్ ఇచ్చారని చెప్పారట. ఈసారికి సర్దుకుని పోవాలని, అతను తోక జాడిస్తే కత్తిరించి పంపిస్తానని చెప్పారట. కాగా బాబు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మీరు చెబితేనే ఆనంకు టికెట్ ఇచ్చానని, ఆయన ఏమీ పట్టించుకోకుండా మొక్కుబడి ఉంటే ఎలా తీసుకోవాలని ప్రశ్నించారట. దీంతో వేమిరెడ్డి బిక్కమొహం వేశారు.
ఆత్మకూరు తర్వాత బుచ్చిరెడ్డిపాళెంలో ప్రజాగళం సభ జరిగింది. దీనికి నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి కూడా జనాన్ని తరలించారు. ఇందుకోసం భారీ ఎత్తున ఖర్చు చేశారు. అయితే ప్రచార రథంపై బాబు, వేమిరెడ్డి దంపతులు, దినేష్‌రెడ్డి మాత్రమే ఎక్కారు. మిగిలిన సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వలేదు. ఎంతో కాలం నుంచి తెలుగుదేశంలో పనిచేస్తుంటే ఇప్పుడొచ్చిన వేమిరెడ్డికే ప్రాధాన్యం ఇవ్వడంపై నేతలు అసహనం వ్యక్తం చేశారు.