ఏంటి ఇప్పుడు ఈ పథకానికే చంద్రబాబు బాధ్యత తీసుకుంటున్నారా.. ?? గతంలో ఏ పథకానికీ ఇలాంటి గ్యారెంటీ బాధ్యత ఆయన తీసుకోలేదా.. అయితే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో అమలు కాకుండా మరుగునపడిపోయిన హామీలకి ఎవరు బాధ్యత తీసుకున్నట్టు మరి.. వన్ గ్రామ్ గోల్డ్ గ్యారెంటీ నగలు అమ్మేవారు అవి నిజం బంగారమే అని చెబితేనైనా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మరు ప్రజలు . చంద్రబాబును జీవితంలో ఒక్కసారి నమ్మిన ఎన్టీఆర్ గారే కాలగర్భంలో కలిసిపోయారు.. చంద్రబాబుకు అంతటి గొప్ప చరిత్ర ఉంది.
పూర్ టూ రిచ్ .. ఇటీవల టీడీపీ మిని మేనిఫెస్టో అంటూ 2024 ఎన్నికలప్పుడు ఇచ్చి తరువాత దాచుకోవాల్సిన మేనిఫెస్టోను 2023 మే లోనే జనాల మీదకు ట్రయిల్ రన్ లా వదిలారు చంద్రబాబు . అందులో ఉన్న అద్భుతమైన పథకమే ఇది. 5 ఏళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని.. అందుకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఏవిధంగా చేస్తారన్నది మాత్రం క్లారిటీ లేదు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి వ్యవసాయానికి తోడు ఉండకూడదు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకూడదు, వ్యాపారాలు పెట్టుకొని బాగుపడేలా మహిళలను ప్రోత్సహించకూడదు, పాల వెల్లువ అంటూ పాడి పరిశ్రమకు హెల్ప్ చెయ్యకూడదు.. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలను సోమరిపోతులను చేస్తుందంటూ చంద్రబాబు బాగా బాధపడ్డారు కాబట్టి.. ఇవేమీ చేయకుండా ప్రజలలో ఆర్ధిక సాధికారతకు ఎలా సహాయపడతారో క్లారిటీ ఇవ్వాలి మరి.
గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఏమాత్రం మంచి చేసాడో.. చూద్ధాం.. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాక. 1995-96 మధ్య కాలంలో రాష్ట్రంలో 18,500 ఫ్యాక్టరీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా.. 2002-2003 మధ్యకాలంలో రాష్ట్రంలో ఫ్యాక్టరీలు 14,635 కుతగ్గిపోయాయి. బియ్యం చిరుధాన్యాల సాగులో 1995-96 లో 9014.2 వేల టన్నులుగా ఉన్న పంట.. 2002-2003 కు వచ్చేసరికి 7327.0 వేల టన్నులకు పడిపోయింది. ఆ కాలంలో రైతులకు చంద్రబాబు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, కరువు తాండవించింది, టెక్నాలజీ అంటూ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలను చంద్రబాబు పూర్తిగా పక్కకు పెట్టేసాడు.. చంద్రబాబు 9 ఏళ్ళ పరిపాలనా కాలంలో రాష్ట్రంలో రైతులు వలసవెళ్ళినట్టు మరెప్పుడు వలసలు జరగలేదు. కేవలం ఆ 9 ఏళ్ళ పరిపాలనలో చంద్రబాబు.. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచేందుకు సహాయపడ్డ వారిని మాత్రమే బాగుపరుస్తూ వచ్చాడు. వారికి మాత్రమే ముఖ్యమైన మంత్రిగా నడుచుకున్నాడు కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రం పనిచెయ్యలేదు.
2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర కరువు తలెత్తిన సమయంలో విద్యుత్ చార్జీలు టీడీపీ ప్రభుత్వం అమాంతం పెంచింది. రైతులు, ప్రజలు వేలల్లో వస్తున్న ఆ కరెంట్ బిల్లులు కట్టలేమని ప్రభుత్వంపై పోరాటానికి దిగగా పోలీసులతో బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపించి ఎంతోమంది మరణానికి చంద్రబాబు నాయుడు కారణమయ్యారు. అంతేకాదు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని పాంప్లేట్లు పంపిణీ చేశాడు. చంద్రబాబు హయాంలో రైతులు రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాల్లోని రైల్వేస్టేషన్లలో భిక్షాటన చేసే గతి పట్టించాడు. హైటెక్ ప్రపంచం.. టెక్నాలజీ అంటూ చంద్రబాబు పరుగులు తీస్తూ రాష్ట్రంలోని పేదలను రైతులను పూర్తిగా కరువుకు వదిలేసాడు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాల్సిన ప్రభుత్వంలో ఉండి.. సాగునీటి ప్రాజెక్టులు కడితే వాటి వల్ల ఖర్చు తప్ప రాబడి ఉండదని చెప్పిన ఆర్థిక నిపుణుడు చంద్రబాబు.
2003 చంద్రబాబు పాలనా కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు లేక భూములన్నీ బీడు పడ్డాయి. రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు పనుల్లేకుండా పోయాయి. పల్లెల్లో బతుకుదెరువు కష్టమైంది. మూటాముల్లె సర్దుకుని నగరాలకు వలస బాట పట్టారు. పల్లెలన్నీ దాదాపు ఖాళీ అయ్యాయి. ఇళ్ల వద్ద వృద్ధులు, పిల్లలు ఆకలి బాధతో అల్లాడిపోయారు. కొన్ని గ్రామాల్లో శ్మశానవైరాగ్యం రాజ్యమేలింది. అయినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం కరువు ఉందని ఒప్పుకోవడానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించి పిల్లల ఆకలి బాధలు తీర్చాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా చంద్రబాబు సర్కారు స్పందించలేదు. ప్రభుత్వం స్పందించకపోవడంతో వామపక్షాలు, ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు సొంతంగా కరువు సహాయక చర్యలకు ఉపక్రమించాయి. గంజి కేంద్రాలు నిర్వహించాయి. ప్రజల ఆహార భద్రత కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనికి ఆహార పథకం బియ్యాన్ని టీడీపీ తమ్ముళ్ళు వేరే రాష్ట్రాల బ్లాక్‌మార్కెట్‌కు తరలించారు. కరువు కాలంలో ప్రజలకు తినడానికి బియ్యమే ఇవ్వని చంద్రబాబు.. ప్రజలను పూర్ టూ రిచ్ గా మారుస్తానంటూ ఇప్పుడు హామీలు ఇస్తున్నారు.
చంద్రబాబు 9 ఏళ్ళ పాలనలో (1995-2004) ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో వెనుకబడే ఉందని P. సాయినాథ్ అనే జర్నలిస్ట్ బహిరంగంగానే చెప్పారు. ఆయన మెగసెసే అవార్డు గ్రహీత మరియు హిందూ పత్రిక ఎడిటర్ కూడా. చంద్రబాబు 9 ఏళ్ళ పరిపాలనా కాలంలో ఇండియాలో సౌత్ ఇండియాలో GDP growth rate అతి తక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన తెలిపారు. ఇండియాలోనే ఎటువంటి మార్పు లేకుండా 1995 – 2004 వరకు శిశు మరణాల రేటు ఆంధ్రప్రదేశ్ లో ఒకే స్థాయిలో ఉండింది. ప్రభుత్వం పౌష్టికాహారం అందించక జరిగిన మరణాలు అవి. చంద్రబాబు పాలనలో సైబరాబాద్ లో అక్షరాస్యతా రేటు బీహార్ లోని పాట్నా కంటే తక్కువగా ఉండింది. సాయినాధ్ గారు చంద్రబాబు గురించి ఒక మాట చెప్పారు.. అబద్ధాన్ని గట్టిగా చెబుతూ పోతే ప్రజలు అదే నిజం అనుకుంటారు.. అదే చంద్రబాబు నాయుడు విషయంలో జరిగిందన్నారు.
ప్రపంచంలోనే అత్యంత గడ్డు కాలమైన కరోనా కష్టకాలం తరువాత.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో.. ఆంధ్రప్రదేశ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం దేశంలోనే అత్యధిక GSDP (స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి) 11.43% వృద్ధి రేటును నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ 2022-23లో GSDP (స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి)లో 16.22% వృద్ధిని నమోదు చేసింది. ఏడాదికి సగటున 12 నుంచి 14 లక్షల టన్నుల ధాన్యం అధికంగా ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి అవుతుంది. రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు వెళుతుందనడానికి ఇంతకుమించి ఉదాహరణలు ఏముంటాయి.
2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2019 వరకు చంద్రబాబు రైతులకు సంబంధించి రుణమాఫీ చెయ్యలేదు. ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టి వెళ్లిపోయాడు. బీమా చెల్లించకుండా వెళ్లిపోయాడు. డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు పెట్టాడు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన బకాయిలు పెట్టాడు. ఆ బకాయిలన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీర్చింది.
ఇంత దారుణంగా పరిపాలించిన చంద్రబాబు మళ్ళీ ఏ మొహం పెట్టుకోని రాష్ట్ర ప్రజలకు మోసపూరిత హామీలు ఇస్తున్నాడు. ఈసారి బాబును నమ్మితే రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కేస్తాడనేది విశ్లేషకుల మాట.