పొదలకూరులో శనివారం చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. బాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన ఆదివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌంటర్ ఇచ్చారు. 1,500 మందితో సభ నిర్వహించి మమ అనిపించారు. గూడూరులో సభ తర్వాత గంటన్నర సేపు అక్కడే వేచి ఉన్నారు. సభ సమయం ప్రకారం 3 గంటలకు 500 మంది కూడా లేరు. మొత్తంగా 1,500 మంది మాత్రమే వచ్చారు. బాబు మాట్లా సమయంలో 300 మంది కూడా లేరు. మెట్ట ప్రాంతమైన సర్వేపల్లికి తెలుగుదేశం ఏమీ చేయలేదు. అందుకే ఏం చెప్పుకోలేక పోయారు. నన్ను.. వైఎస్ జగన్‌ను తిట్టారు. నా మీద చంద్రబాబు అభియోగాలు చేశారు. వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని కోర్టును కోరేందుకు నేను సిద్ధం. తనపై వచ్చిన అభియోగాలపై బాబుకు సీబీఐ విచారణ కోరే దమ్ము ఉందా? టీడీపీ హామీలపై ప్రజలకు నమ్మకం లేదు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలకు తెలుసు. సర్వేపల్లిలో చంద్రబాబు కేజీఎఫ్ అన్నారు. సర్వేపల్లిలో జరిగిన అభివృద్ధి చూపిస్తా రండి. వాటిని చూస్తే కుప్పంలో ఎందుకు ఈ పనులు చేయలేకపోయానని చంద్రబాబు బాధ పడతారు. ప్రజలకు కూటమిపై నమ్మకం లేదు. పొదలకూరు సభకు ప్రజలు రాకపోతే నేను ఆపానని ఆరోపించారు. సోమిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లారు. ప్రజలు రాకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. వ్యవసాయం గురించి బాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ హయాంలో వర్షాలు కురవలేదు. కానీ బ్రహ్మాండంగా వ్యవసాయం జరిపించానని చెబుతున్నారు. కోర్టులో ఫైళ్ల చోరీపై సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. సర్వేపల్లిలో పోటీ చేసేందుకు పలువురిని ప్రయత్నించారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఇటీవల పార్టీలో చేరిన వారిని కూడా అడిగాడు. ఎవరూ రాకపోవడంతో సోమిరెడ్డికి టికెట్ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో మార్పులు తీసుకొచ్చాను. సోమిరెడ్డి హయాంలో రైతులను దోచుకున్నారు. రైతు రథం లోకూడా కమీషన్లు కొట్టారు. జగన్‌ను విమర్శించే స్థాయి బాబుకు లేదు. టికెట్ల కేటాయింపులో వైఎస్సార్సీపీ సామాజిక న్యాయం పాటించింది. వచ్చే ఎన్నికల్లో ఒక స్థానం కూడా టీడీపీకి రాదు. కానీ బాబు లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు నేతలు వైఎస్సార్సీపీని వీడినా ఇబ్బంది లేదు. సర్వేపల్లి నియోజకవర్గంలో దొరికిన మద్యంపై విచారణ జరుగుతోంది.