తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇది మింగుడుపడని విషయమే. సీట్ల ప్రకటనలో తమ అధినేత చంద్రబాబు నాయుడి మార్క్ పూర్తిగా పోయి జనసేనాని డామినేషన్ కనిపించింది. భారతీయ జనతా పార్టీతో పొత్తు, కాపుల ఓట్ల కోసం బాబు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ముందు నుంచి అనుకున్నట్లుగా టీడీపీ సీనియర్లకు హ్యాండ్ ఇచ్చారు. తొలివిడతలో 94 మంది తన పార్టీ అభ్యర్థులను బాబు ప్రకటించగా.. మొత్తంగా జనసేనకు 24 అసెంబ్లీ, మూడు ఎంపీ స్థానాలే దక్కాయి. కాగా సేనాని ప్రస్తుతానికి ఐదు సీట్లు మాత్రమే వెల్లడించారు. కొన్నింటి విషయంలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మళ్లీ ప్రకటించే అవకాశముంది. టీడీపీ సీనియర్లకు టికెట్లు లేకుండా చేయడంలో పవన్ చాలావరకు సక్సెస్ అయ్యారు.
తెలుగుదేశం మొదటి జాబితాలో సీనియర్లకు గట్టి షాక్ తగిలింది. కొందరికి సీట్లు ఖరారైనట్లు ప్రకటించలేదు. కొన్నిచోట్ల వారిని కాదని వేరే వారికి కేటాయించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి కావాలని డిమాండ్ చేయగా చంద్రబాబు ఆయన్ను చీపురుపల్లికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో ఈ విషయం తెగలేదు. పవన్ భీమిలి సీటును వంశీకృష్ణ యాదవ్‌కు ఇప్పించాలని చూస్తున్నారు. ఇది పెండింగ్‌లో పడింది. రాజమండ్రి రూరల్ సీటును కూడా ప్రకటించకుండా పవన్ ఆపేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి కాకుండా సేన అభ్యర్థి కందుల దుర్గేష్ కోసం ఇచ్చేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ సీటును బుద్ధా వెంకన్న కోరుతూ ఇటీవల నారా వారి పేరును రక్తంతో రాసినా ఉపయోగం లేకుండాపోయిది. ఈ స్థానం కోసం జనసేన నాయకుడు పోతిన మహేష్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో దీని ప్రకటన కూడా వాయిదా పడింది. టీడీపీలో అత్యంత సీనియర్ అయిన ఆలపాటి రాజాకు చంద్రబాబు సీటు దక్కలేదు. పవన్ తన సన్నిహితుడైన నాదెంట్ల మనోహర్‌కు ఇప్పించుకున్నారు. కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ స్థానం ఆశించిన విషయం తెలిసిందే. అయితే నాగబాబు పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో కొణతాలకు అనకాపల్లి అసెంబ్లీ ఇచ్చి సర్దిచెప్పారు.
నూజివీడులో మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావును కాదని పార్థసారథిని బాబు అభ్యర్థిగా ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో బొల్లినేని రామారావుకు చంద్రబాబు బ్రేక్ వేశారు. లోకేశ్ ఒత్తిడితో కాకర్ల సురేష్‌కు టికెట్ ప్రకటించారు. దీంతో బొల్లినేని తనను వాడుకుని వదిలేశారని ఆగ్రహంతో ఉన్నారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని వైఎస్సార్సీపీ అధిష్టానం సస్పెండ్ చేయగా టీడీపీలో చేరారు. ఈయన్ను అసలు పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించలేదు. కోవూరు అభ్యర్థి ఎవరో చెప్పలేదు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనయుడు, ఇన్చార్జి దినేష్‌రెడ్డి తానే పోటీలో ఉంటానని చెప్పారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భార్య ప్రశాంతరెడ్డి కోసం ఆపినట్లు తెలిసింది. కావలి టికెట్‌ను మాలేపాటి సుబ్బానాయుడిని కాదని కావ్య కృష్ణారెడ్డికి అమ్మేశారు. ఆత్మకూరు నుంచి బరిలో దిగేందుకు ఆనం రామనారాయణరెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. వెంకటగిరి టికెట్ అడుగుతున్నారు. అక్కడున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ.. ఆనంకు ఇస్తే సహించనన్నారు. దీంతో అటు ఆత్మకూరు, ఇటు వెంకటగిరి స్థానాలకు తొలిజాబితాలో చోటు దక్కలేదు.
సర్వేపల్లి సీటు తనదే అని మాజీ మంత్రి, టీడీపీ పొలిటిట్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బాగా ఎగిరారు. అయితే ఆయన పేరు కూడా లేదు. లోకేశ్‌కు ఇష్టం లేకపోవడంతో ఆపినట్లు తెలిసింది. శ్రీకాళహస్తి, తిరుపతి స్థానాలను పవన్ అడుగుతున్నారు. దీంతో వాటిని పెండింగ్‌లో పెట్టారు. కాళహస్తి నుంచి మాజీ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి బరిలో ఉండాలని చూస్తుండగా ఆయనకు హ్యాండ్ ఇస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. జాబితాలో మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరు కనిపించలేదు. ఈయనకు ఈసారి సీటు డౌట్ అని ప్రచారం ఉంది. పరిటాల శ్రీరామ్ ధర్మవరం స్థానం అడుగుతుండగా చంద్రబాబు కుటుంబంలో ఒకరికేనని తేల్చి చెప్పారు. అయితే ఈ సీటును కూడా ప్రకటించలేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు పవన్‌రెడ్డి పేరును ఇప్పటికి పరిగనణలోకి తీసుకున్నట్లు లేదు.
పవన్ పెందుర్తి, గాజువాక, విశాఖ దక్షిణం, అనకాపల్లి, యలమంచిలి నుంచి తమ అభ్యర్థులు బరిలో ఉంటారని ప్రకటించారు. కానీ అందులో అనకాపల్లికి మాత్రమే అభ్యర్థి ఎవరో చెప్పారు. మిగిలినవి పెండింగ్‌లో ఉంచారు. చంద్రబాబు తమవారిని సేనలోకి పంపి ఆ స్థానాల్లో పోటీ చేయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనుకున్నట్లుగానే ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎక్కువ సీట్లు తీసుకుంది. ఇక్కడ ఏ విషయంలో పవన్ బాబుకు లొంగిపోయాడో తెలియాల్సి ఉంది. కానీ ఇటీవల సీనియర్లకు రిటైర్మెంట్ అవసరమని చెప్పిన సేనాని అందుకు తగినట్లుగానే టీడీపీ వృద్ధులను పక్కన పెట్టించారు.
మరోసారి బాబు కుప్పం నుంచే బరిలోకి దిగనున్నారు. ఆయన తనయుడు లోకేశ్‌కు మంగళగిరి, బాలకృష్ణకు హిందూపురంలో మళ్లీ అవకాశం ఇచ్చారు. బాబు ఇంకా 57 సీట్లు ప్రకటించాల్సి ఉంది. బీజేపీతో పొత్తు ఓకే అవుతుందనే వాటిని ఆపినట్లు తెలుస్తోంది.