ఫెయిలై జనంలో టాక్ లేని సినిమాను జాకీలు పెట్టి లేపేందుకు నిర్మాతలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియా పేజీల్లో అనుకూలంగా పోస్టులు పెట్టిస్తుంటారు. అయితే అవేమీ ఫలించవు. ఒక్కసారి ఫ్లాప్ లిస్ట్‌లోకి వెళ్తే దాని గురించి మర్చిపోవాల్సిందే. ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి కూడా అంతే. 2019లో ఘోరంగా ఓడిపోయి అట్టర్ ఫ్లాప్ అయిన ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు చాలా కీలకం. దీంతో ఎక్కడేని హైప్ తెచ్చేందుకు అధినేత చంద్రబాబు నాయుడు తపన పడుతున్నారు.
బుధవారం ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో నాయకులు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అనగాని, గొట్టిపాటి, కంభంపాటి తదితరులతో సమావేశమయ్యారు. ఎల్లో మీడియాలో దీనిపై ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలు టచ్‌లోకి వస్తున్నారు. వారందరినీ తీసుకోలేమని బాబు చెప్పారట. అన్నీ ఆలోచించే నిర్ణయాలు ఉంటాయి. పొత్తులు, చేరికల వల్ల పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదని టీడీపీ అధినేత అన్నారని ప్రచారం చేస్తున్నారు.
ఎల్లో మీడియా చెప్పిన పరిస్థితి లేనే లేదు. టీడీపీ భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. జనసేనను కీలుబొమ్మలా ఆడిస్తోంది. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయడం లేదు. రా కదలిరా, లోకేశ్ శంఖారావం సభలను జనం పట్టించుకోవడం లేదు. పెద్ద సంస్థల సర్వేలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బాబుకు ఓటమి భయం పట్టుకుంది. తన ధన బలంతో ఒకరిద్దరు వైఎస్సార్సీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారి చేత జగన్‌ను తిట్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. నాయకులంతా వచ్చేస్తున్నారని, గెలుపు మాదేనని భ్రమలు సృష్టిస్తున్నారు. అయితే జగన్ పార్టీ ముఖ్యనేతలు టీడీపీ అధినేతతో టచ్‌లో లేరు. అసెంబ్లీ స్థానాల మార్పు నేపథ్యంలో కొందరు మాత్రమే పక్క చూపులు చూశారు. వారిలో పలువురు అధినేత మాట వింటామని ఇప్పటికే కుండబద్ధలు కొట్టారు. నిజంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా క్యూలో ఉంటే రాజ్యసభ ఎన్నికల నుంచి బాబు ఎందుకు తప్పుకొన్నట్లు. ఓటమి భయం ఉంది కాబట్టే కదా..
వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో ఇప్పటికే తెలుగుదేశం అస్తవ్యస్తమైపోయింది. తెలుగు తమ్ముళ్లు మాట వినడం లేదు. వారిని తన వైపు తిప్పుకోవాలంటే ఏదో ఒకటి చేయాలని భావించిన బాబు పచ్చ పత్రికల్లో పిచ్చి రాతలు రాయిస్తున్నారు. అసలు వైఎస్సార్సీపీ ఎవరు వచ్చినా తీసుకోలేమని చెప్పడం శుద్ధ అబద్ధం. ఎవరెవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. రెండు రోజుల క్రితం నెల్లూరులో ఒక వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్‌ను నారాయణ కొనుగోలు చేశారు. సాక్షాత్తు బాబే ఆయన మెడలో టీడీపీ కండువా వేశారు. దీనికి నెల్లూరు జిల్లాలో జగన్ పని అయిపోయిందని హోరెత్తించారు. ప్రస్తుతం బాబు ఉన్న స్థితిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త వచ్చినా తీసుకుని తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటారు. ఇక బీజేపీ, జనసేనతో పొత్తు, వలస నాయకుల వల్ల సీట్లు ఆశిస్తున్న టీడీపీ నేతలకు వెన్నుపోటు తప్పదు. తన స్వార్థం కోసం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్న వారికి టికెట్లు ఎగ్గొటేందుకు బాబు వెనుకాడని పరిస్థితి ఉంది. పైకి మాత్రం కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదని అన్నారని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు. జాగ్రత్త తమ్ముళ్లూ.. మీ పార్టీ సినిమా ఎప్పుడో అయిపోయింది. కాకపోతే అధినేత డబ్బు పెట్టి ఆడిస్తున్నాడంతే. స్వలాభం కోసం ఎంతకైనా తెగించే మనిషి చంద్రబాబు. ఆయన్ను నమ్మితే నట్టేట మునిగినట్లే..