ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలవేళ అన్ని పార్టీలు ఎన్నికల రణ క్షేత్రానికి సిద్దమవుతుంటాయి. వాటి బలాలని బేరీజు వేసుకుని ఎత్తులు పై ఎత్తులతో పావులు కదుపుతుంటాయి. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అధికార పార్టీ దూసుకుని పోతుంటే తెలుగుదేశం , జనసేన మాత్రం ఎన్నికల రేస్ లో చతికిలపడినట్టే కనిపిస్తుంది.
ఇప్పటికే రాష్ట్రంలోని అధికార పక్షం అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులని మారుస్తూ కొత్త అభ్యర్ధులని ప్రకటిస్తూ నాలుగు జాబితాలు విడుదల చేసి రేస్ లో దూసుకుని పోతుంటే మరోపక్క తెలుగుదేశం జనసేన పార్టీలు మాత్రం పొత్తులు కుదుర్చుకుని అభ్యర్ధులని ప్రకటించలేక ఏ నియోజక వర్గంలో ఏ అభ్యర్ధిని మారిస్తే ఎక్కడ కుంపటి రాచుకుని మొదటికే మోసం వస్తుందోనని తటపటాయిస్తునట్టు కనిపిస్తుంది.
జనసేన టీడీపీ పొత్తు ప్రకటించిన నేపధ్యంలో రాష్ట్రంలో అనేక నియోజక వర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న ఇరుపార్టీ నేతలు ఆ స్థానం తమదంటే తమదని ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో తిరుగుతున్నారు. మరికొన్ని సెగ్మెంట్లలో టికెట్ రేసులో మేము ఉన్నం అంటే మేము ఉన్నాం అని బాహా బాహికి దిగిన సంధర్భాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఇరుపార్టీ అధినేతలు మాత్రం కనీసం ఎవరికి సదరు నియోజకవర్గ టికెట్ ఇస్తునట్టో ప్రకటించడంలో వెనకడుగు వేస్తున్నారు. దింతో ఇరు పార్టీ కార్యకర్తలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఒక పక్క అధికార పక్షం ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేసి నియోజక వర్గాల్లో పరిస్థితులను చక్కబెడుతూ ఈనెల 25న ఉత్తరాంద్ర భీమిలి నుండి తొలి బహిరంగ సభ పెట్టి ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్దమౌతుంటే, ఇప్పటికి అభ్యర్ధులని తేల్చుకొలేక టీడీపీ జనసేన పార్టీలు, పొత్తులపై ఇంకా ఒక అభిప్రాయానికి రాలేక బిజెపి ఎన్నికల రేస్ లో వెనక పడి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకున్నాయి.