బుల్లెట్ రైలెక్కి తిరిగేద్దాం రెడీగా ఉండడంటూ ఆరోజుల్లో చంద్రబాబు నాయుడు ఊదరగొట్టారు. ఇది సాధ్యమయ్యే పని కాదని తెలిసినా.. ప్రజలను మభ్యపెట్టేందుకు కట్టు కథలు చెప్పాడు. 2016లో సీఎంగా ఉన్నప్పుడు బాబు చైనా పర్యటనకు వెళ్లారు. బుల్లెట్ ట్రైన్లో 140 కిలోమీటర్లు ప్రయాణించారు. బీజింగ్‌లో చైనా రైల్ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. అమరావతి – విశాఖ, అమరావతి – హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్, హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలపై ఆనాడు చర్చించినట్లు చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా టీడీపీ సోషల్ మీడియాల్లో పేజీల్లో తెగ హడావుడి చేశారు. చైనా పర్యటనలో బుల్లెట్ రైలెక్కిన బాబు.. దానిని అమరావతికి తెచ్చేందుకు సమాలోచనలు.. అటు పాలన.. ఇటు అభివృద్ధి రైల్లా యమస్పీడులో పరుగులు పెట్టడమే అంటూ డబ్బా కొట్టారు. వాస్తవానికి రైల్వే శాఖ కేంద్రం పరిధిలో ఉంటుంది.
మన దేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రక్రియ ఆలస్యంగా నడుస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయంపై ఇటీవల అప్డేట్ ఇచ్చారు. 2026లో అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు తొలి బుల్లెట్ రైలు నడుస్తుందని ప్రకటించారు. జపాన్ షింకన్సెన్ టెక్నాలజీతో 508 కిలోమీటర్ల దూరంతో ఈ కారిడార్ హై స్పీడ్ రైల్వే మార్గాన్ని కేంద్రం నిర్మిస్తోంది. అధిక శాతం రుణాన్ని ఆ దేశమే అందిస్తోంది. ఈ ప్రాజెక్టు 2022లోనే పూర్తి చేయాలని తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మొత్తం వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. దేశంలోనే మొదటిసారిగా శ్లాబ్ ట్రాక్ వ్యవస్థ, భూకంపాలను ముందుగానే గుర్తించే ఏర్పాట్లు, ఏడు సొరంగాలు, సముద్ర గర్భంలో 7 కి.మీ టన్నెల్, 28 స్టీల్ బ్రిడ్జీలు, 12 రైల్వేష్టేషన్లు రూపుదిద్దుకుంటున్నాయి.
ఎంతో తతంగం ఉన్న ప్రాజెక్టును చాలా సులభంగా ఏపీలో ఏర్పాటు చేస్తామని ఆరోజుల్లో చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రకటించింది. అన్ని వనరులన్న కేంద్రానికే ఇంత కాలం పడుతోంది. అసలు తన పరిధిలో లేని విషయంపై బాబు గొప్పలకు పోయారు. హైపల్లూప్ టెక్నాలజీ అంటూ కబుర్లు చెప్పారు. టీడీపీ హయాంలో విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులంటూ ప్రకటనలు చేశారు. కానీ ఐదేళ్లలో తీసుకున్న చర్యలు శూన్యం. మెట్రోకే దిక్కు లేకపోతే బుల్లెట్ రైళ్లను పరుగులు పెట్టిస్తానని నారా వారు ఊదరగొడితే తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోయారు.ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట. అధికారం కోసం ఏమైనా చెబుతారు. చందమామపై అమరావతి బ్రాంచ్ ఏర్పాటు చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.