ఎల్లో మీడియా దృష్టిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొర్రెలు. తాము ఏం చెప్పినా నమ్మేస్తారని వారి గట్టి నమ్మకం. చంద్రబాబు ఆ మీడియానే నమ్ముకుని కుళ్లు రాజకీయాలు చేస్తుంటారు. వారి మాటలు, చేష్టలను నిశితంగా పరిశీలించే వారికి దీని గురించి బాగా తెలుసుంటుంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న సమయంలో అన్ని వర్గాల సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. అందరినీ ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆయన 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. సచివాలయ, వ్యవస్థల ద్వారా ఇళ్ల ముంగిటకే పథకాలను చేర్చారు. అర్హతే ప్రామాణికంగా నగదును లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో వేశారు. దీనిపై తెలుగుదేశం, జనసేన, తదితరులు ఏడుపు వర్ణనాతీతం. తాము ఏది చేసినా సంసారం, పక్కవారు చేస్తే మాత్రం వ్యభిచారం అనే రీతిలో వ్యవహరించాయి. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఎల్లో మీడియా ఊదరగొట్టేది. దానికి చంద్రబాబు వంత పాడేవారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బాబు శ్రీలంక వెళ్లి ఇచ్చిన బిల్డప్ అంతా ఇంత కాదు. లంక, ఏపీ కలిసి పని చేస్తాయని ఆ రోజుల్లో తెగ డబ్బా కొట్టారు. కాలం క్రితం శ్రీలంకలో పరిస్థితులు మారాయి. ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. బాబు ప్రపంచాన్ని ఎప్పుడూ తన కోణంలో నుంచి చూస్తుంటారు. లంకతో గత స్నేహాన్ని మరిచి మాటలు అందుకున్నారు. మన రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నా ఆ దేశంతో తో పోల్చి శునకానందం పొందారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమర్థించారు. జగన్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. లబ్ధిదారులు బాగుపడుతున్న విషయాన్ని ఓర్వలేక బాబు, పవన్ ఇష్టం వచ్చినట్లు వాగేవారు. అయితే ప్రజలు వారిని పట్టించుకోలేదు. పథకాలు అందుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.
సంక్షేమ పథకాలకు ఉన్న ఆదరణను చూసి బాబు స్వరం మారింది. కర్ణాటకలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను టీడీపీ కాపీ కొట్టి గ్యారెంటీల పేరుతో ప్రజల ముందుకు వచ్చింది. ఏపీ శ్రీలంక అయిపోయిందని వార్తలను వండి వార్చిన ఎల్లో మీడియా యూటర్న్ తీసుకోక తప్పలేదు. టీడీపీ పథకాలను ఆహా.. ఓహో.. అంటూ రోజూ పొగుడుతోంది.
తాజాగా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య టీడీపీ, జనసేన కూటమికి కొన్ని సలహాలు ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. అంతకంటే మిన్నగా పథకాలతో మేనిఫెస్టో రూపొందించాలని పవన్ కు లేఖ రాశారు. తెల్ల కార్డులు ఉన్నవారికి నెలకు రూ.2 వేలు, ఆ కుటుంబాల్లోని పిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటర్, రూ.5 లక్షల బీమా సౌకర్యం, విద్యుత్ బిల్లులపై 20 శాతం సబ్సిడీ, డ్వాక్రా మహిళలకు రూ.25 వేల రుణమాఫీ, ప్రతి ఏటా రైతులకు 5000 నుంచి పదివేల రూపాయల పెట్టుబడి సాయం, 5 వేల రూపాయలు నిరుద్యోగ భృతి, రూ.4 వేలు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టాలన్నారు.
ఏపీ మరో శ్రీలంక అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేగొండి లేఖపై ఎలా స్పందిస్తారో..
– వీకే..