‘అనపర్తి సీటు తెలుగుదేశం పార్టీకి ఇస్తే ఒప్పుకోను. అలా అని బీజేపీ నాయకుడికి అక్కడ అవకాశం ఇవ్వను. చంద్రబాబు నాయుడి ఆదేశాల ప్రకారం టీడీపీ నాయకుడికి కమలం కండువా కప్పి టికెట్ ఇచ్చేస్తా’ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ధోరణి ఇది ఆమె, బాబు కలిసి కాషాయ పార్టీని ఏ విధంగా దెబ్బతీస్తున్నారో మరోసారి బయట పడింది.
ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు తమకే కావాలని బీజేపీ పట్టు పట్టింది. మాజీ సైనికుడు ఎం.శివకృష్ణంరాజుకు కేటాయించారు. ఇక్కడే రగడ మొదలైంది. నల్లమిల్లి తెలుగు తమ్ముళ్లు, జనసేన నేతలతో కలిసి రచ్చ చేయడం ప్రారంభించారు. ఈయన ఒత్తిడికి చంద్రబాబు లొంగిపోయారు. దీంతో పురందేశ్వరితో మాట్లాడారు. ఆమె శివకృష్ణంరాజును సైడ్ చేయడం మొదలుపెట్టారు. అధిష్టానానికి కట్టు కథలు చెప్పారు. దీంతో సీటు బీజేపీకే ఉంటుంది. కాకపోతే చంద్రబాబు మనిషి పోటీలో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
తాజాగా నల్లమిల్లికి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. బాబు చెప్పడంతో ఈయన్ను పురందేశ్వరి బీజేపీలో చేర్చుకుంటున్నారు. కమలం పెద్దలకు తాము సీటు వదులుకోలేదని, అభ్యర్థిని మార్చామని చూపించనున్నారు. కానీ దీని వెనుక జరిగిన కథ వారికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రామకృష్ణారెడ్డి స్థానికంగా బీజేపీ నేతలతో మాట్లాడుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ సీనియర్ కమలం నేతలు అసంతృప్తిగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి.
బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై మాజీ సీఎస్, ఆ పార్టీ నాయకుడు సోషల్ మీడియాలో స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి దిశ దశ లేకుండా సాగుతోందని చెప్పడానికిS ఇది ఇంకొక ఉదాహరణ. బీజేపీకి గెలిచే అవకాశాలు పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి. కానీ సీట్ల పంపిణీలో బీజేపీ తీసుకున్నవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలవి. తీసుకున్న మూడు, నాలుగు పట్టణ ప్రాంత నియోజకవర్గాలను చూస్తే విజయవాడ పశ్చిమ ముస్లిం మెజారిటీ ప్రాంతం. ఏ ప్రాతిపదికన ఈ సీట్లను టీడీపీ ఇచ్చింది బీజేపీ తీసుకుందో అర్థం కావడం లేదు. కొంతమంది అభ్యర్థులను ముందే బీజేపీ నిర్ణయించి ఉంటే వాళ్లకు కలిసివచ్చే నియోజకవర్గాలను గట్టిగా అడిగి తీసుకొని ఉండాల్సింది. అలాకాకుండా టీడీపీ ఇచ్చిన నియోజకవర్గాల్లో తాము నిర్ణయించిన అభ్యర్థులను సర్దుబాటు చేసే ప్రయత్నంతో వచ్చిన తంటలే ఇది అంతా. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిని పార్టీలో చేర్చుకొని అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం పార్టీ మనుగడనే ప్రశ్నించే చర్య. ఒకవేళ కావాలనుకుంటే ఆ సీటు టీడీపీకి వదిలి రాజమండ్రి అర్బన్ తీసుకొని సోము వీర్రాజు చేత పోటీ చేయించవచ్చు. కానీ దానివల్ల తెలుగుదేశానికి ఇబ్బంది కలుగుతుంది. టీడీపీకి తోకలా ఉన్న బీజేపీ భవిష్యత్‌లో ఆ పార్టీలో కలిసిపోయే ప్రమాదం ఉంది’ అంటూ పోస్టు చేశారు.
సీనియర్లు ఎన్ని చెప్పినా పురందేశ్వరి తన వైఖరిని మార్చుకోవడం లేదు. టీడీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకు సాగుతున్నారు. అనపర్తి సీటుకు అభ్యర్థి ఎంపికే ఇందుకు ఉదాహరణ.