కాపు రిజర్వేషన్లు అనే బంగారు కడియం పట్టుకుని ముసలి పులి వలే చంద్రబాబు కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కధలు అల్లుతూ ఉంటాడు. సాధ్యాసాధ్యాలతో సంభంధంలేకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులని బట్టి మాటలు మారుస్తూ కొత్త కధలల్లుతూ వారిని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఇది సరిపోదన్నట్టు ఇప్పుడు ఆయన కొడుకు లోకేష్ కూడా తయారయ్యాడు.
యువగళం యాత్ర పేరున తిరుగుతున్న లోకేష్ ఏ విషయము పైనా పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఆపూటకి మమ అనిపిస్తూ ఉన్నాడు. అక్కడితో ఆగకుండా, చట్టాలు, రాజ్యంగ పరిధిలోని అంశాలని కూడా చూడకుండా మాట్లాడుతూ ప్రజల్లో ఇప్పటికే తన అసమర్ధతని బయటపెట్టుకున్నాడు. ఇది సరిపోదన్నట్టు మరోసారి తన పరిధిలో లేని కాపు రిజర్వేషన్లపై హామీలు ఇచ్చేస్తున్నాడు.
లోకేష్ చేపట్టిన యాత్ర 3 వేల కిలో మీటర్లు పూర్తైన సందర్భంగా తుని మండలం తేటగుంట చెక్ పోస్ట్ వద్ద పలు వర్గాల్తో లోకేష్ సమావేశం అయ్యాడు. ఈ సందర్భంగానే కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని ఆయన దృష్టికి టీడీపీలోని కొందరు తీసుకొచ్చారు. 2019కి ముందే కేంద్రం ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు కేటాయించిన 10 శాతంలో కాపులకు 5 శాతం వర్తింపజేసే విధంగా అసెంబ్లీలో తీర్మాణం చేసి ఆమోదించామని అయితే ప్రభుత్వం మారడంతో ఇది చట్టబద్దం దాల్చలేదన్నారు లోకేష్. ప్రస్తుతం బిసిలు అనుభవిస్తున్న ప్రయోజనాలకేమాత్రం ఆటంకం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నదే తమ లక్ష్యమని ఉపన్యాసాలు ఇచ్చారు.
అయితే అది ఎలా సాధ్యమో మాత్రం చెప్పలేదు. తమ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటనేది కూడా చెప్పలేదు. ఒక పక్క ఈడబ్ల్యూఎస్ కోటాలో నుండి 5% అంటూనే మరో పక్క బీసీలకి నష్టంలేకుండా అంటూ పొంతన లేకుండా మాట్లాడి తన అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకుని నవ్వులపాలయ్యాడు. లోకేష్ చెప్పిన ఈ అర్ధంలేని మాట్లతో అక్కడికి వచ్చిన కాపు నాయకులు, అవే కథలు.. అదే వంచన అని పెదవి విరిచారు.
కాపులను బీసీల్లో చేరుస్తామని 2014 ఎన్నికల సమయంలో మానిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు రెండేళ్లపాటు ఆ సంగతే మర్చిపోయారు. కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారి ఆద్వర్యంలో తీవ్రంగా సాగిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉధృత రూపం దాల్చడం, ఇచ్చిన హామీని అమలు చేయలేదని కాపుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో విధి లేని పరిస్థితుల్లో తూతూమంత్రంగా మంజునాథ కమిషన్‌ను నియమించారు చంద్రబాబు. చివరకు ఆ కమిషన్ చైర్మన్ సంతకం లేకుండానే హడావుడిగా నివేదికను తెప్పించుకుని, కాపులను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపి అక్కడితో తాము హామీని నేరవేర్చాం అని చేతులు దులుపుకుని తన మార్క్ మోసాన్ని ప్రదర్శించారు.
అయితే ఇది గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఝాట్స్ కేసు తీర్పులకు వ్యతిరేకంగా ఉందని తెలిసినా, మండల్ కమీషన్ సిఫారులుపై అవగాహన ఉన్నా ప్రజలను మోసం చేయడం కోసమే చేసిన పని అని ప్రతిపక్షాలు , ప్రజాస్వామ్య పక్షాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి.
తాను చేసిన మోసం ప్రజలకు మరీ ముఖ్యంగా కాపులకు పూర్తిగా అర్ధమైందన్న విషయం తెలుసుకున్న తరువాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా మరో మోసానికి తెరలేపారు. రిజర్వేషన్ల కేటగిరీలో లేని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో విధాన నిర్ణయం తీసుకుంది. అదే స్ఫూర్తితో ఆ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాల్సిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అవకాశాన్ని వాడుకుని మరో కుట్రకు తెరతీసారు, రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరించారు.
ఈడబ్ల్యూఎస్ వర్గలకు కేటాయించిన 10 శాతం కోటాను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా విభజించారు. అందులో 5 శాతం కాపు సామాజికవర్గానికి, మిగిలిన 5 శాతాన్ని ఇతర అగ్రవర్ణాల పేదలకు కేటాయిస్తూ అప్పట్లో చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కాపు సామాజికవర్గ ప్రతినిధులతో పాటు రాజ్యాంగ నిపుణులు, అగ్రవర్ణ పేదలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్ల స్ఫూర్తిని చంద్రబాబు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను బీసీల్లో చేరుస్తామని మోసం చేసిన చంద్రబాబు ఈడబ్ల్యూఎస్‌లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు సరికొత్త మోసానికి తెర తీయడంపై కాపు సామాజికవర్గ నేతలు భగ్గుమన్నారు. అసలు తాము బీసీలమా? ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన వారమా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లను విభజించడాన్ని సవాల్ చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను విభజించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ చంద్రబాబు సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు నిలిచిపోయింది. చంద్రబాబు నిర్వాకంతో అటు కాపు సామాజికవర్గం, ఇటు ఆర్థికంగా వెనుబడిన ఇతర అగ్రకులాలు తీవ్రంగా నష్టపోయాయి. మొదట కాపులు, బీసీలు మధ్య రిజర్వేషన్ల పేరున చిచ్చుపెట్టిన చంద్రబాబు తరువాత ఈడబ్ల్యూఎస్, కాపుల మధ్య చిచ్చు పెట్టాడు. గతంలో కూడా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి చంద్రబాబు మాల, మాదిగ వర్గాల మధ్య గొడవ పెట్టి రాజకీయంగా వాడుకున్న విషయం తెలిసిందే.
జగన్ గారు మాత్రం తనకి నష్టం వస్తుందని తెలిసినా కాపులని ఎక్కడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయలేదు. కాపు రిజర్వేషన్ అంశం నా చేతిలో లేని పనని నిజాయతీగా చెప్పారు , నేను చంద్రబాబు మాదిరి నా చేతుల్లో పనని చెప్పి మోసం చేయనని స్పష్టం చేశారు, నా చేతిలో పని అయిన కాపు కార్పొరేషన్ నిధులు నేను ఇస్తాను అని చెప్పారు. చెప్పినట్టుగానే కాపులకి గత ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం చేయని విధంగా మేలు చేశారు. కాపుల సంక్షేమం కోసం జగన్ ఈ నాలుగున్నర ఏళ్లల్లో వివిధ పధకాల ద్వారా అందించిన లబ్ది 39,247 కోట్లు, అదే చంద్రబాబు 5ఏళ్ళల్లో ఏడాదికి కాపులకి 400 కోట్లు కూడా ఖర్చు చేయని దుస్థితి.
మళ్ళీ నేడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేల తమకి బాగా అలవాటైన మోసపు మాటలకి తెరలేపిన లోకేష్ సాధ్యాసాధ్యాలతో పనిలేకుండా 2019కి ముందే కేంద్రం ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు కేటాయించిన 10 శాతంలో కాపులకు తాము 5 శాతం వర్తింపజేసే విధంగా అసెంబ్లీలో ఆమోదించామని అది ఏదో జగన్ గారి ప్రభుత్వం తీసేసినట్టుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మరోపక్క పొంతన లేకుండా బిసిలు అనుభవిస్తున్న ప్రయోజనాలకే మాత్రం ఆటంకం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నదే తమ లక్ష్యమని సుప్రీంకోర్టు తీర్పులకి వ్యతిరేకంగా మాట్లాడుతూ తన అజ్ఞాన్నాన్ని బయటపెట్టుకున్నాడు. ఈ నేపధ్యంలో ప్రజలని పదే పదే మాటలతో మోసం చేయకపోతే తమది టీడీపీ పార్టీ ఎలా అవుతుంది అన్నట్టు ప్రవర్తిస్తున్నాడని లోకేష్ మాటలు విన్న సామాన్యులు మాట్లాడుకోవడం గమనార్హం.